
జనగామ, వెలుగు : జనాభాకు అనుగుణంగా పోలీసుల సంఖ్య లేదని, సమాజ భద్రతలో మహిళలు భాగస్వాములు కావాలని వరంగల్ సీపీ శ్వేత పిలుపునిచ్చారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 26 లక్షల జనాభాకు కేవలం 3 వేల మంది పోలీసులు మాత్రమే ఉన్నారని తెలిపారు. జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన డ్రగ్ రహిత సమాజం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలనలో మహిళలు ముందుండాలని, ప్రతి మహిళ కుటుంబంతో పాటు గ్రామాలు, పట్టణాలను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే ‘సంఘమిత్ర’గా వ్యవహరించాలని సూచించారు.
డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిస్తే 112కు డయల్ చేసి పోలీసులకు తెలియజేయాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నేరస్తులుగా చూడకుండా చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రతపై గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఇతర అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.