గణాంకాల ప్రకారం భారత్ ఏటా 28 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా చక్కెరను వినియోగిస్తుంది. దీని ప్రకారం దేశంలో రోజుకు సుమారు 75,000 నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల (75 నుండి 80 మిలియన్ కిలోలు) చక్కెర ఖర్చవుతుంది. సగటున లెక్కగడితే ప్రతి పౌరుడు రోజుకు దాదాపు 50 నుంచి 60 గ్రాముల చక్కెరను తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
మనం ఈ చక్కెరను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారంలో చేర్చుకుంటున్నాము. ఇంట్లో తయారుచేసే టీ, పాలు, మిఠాయిల ద్వారా నేరుగా చక్కెర శరీరంలోకి చేరుతుండగా.. కూల్ డ్రింకులు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, బిస్కెట్లు, కేకులు, సాస్‌లు, రెడీ టు ఈట్ స్నాక్స్ ద్వారా పరోక్ష చక్కెర భారీ మొత్తంలో శరీరంలోకి చేరుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు గరిష్టంగా 25 గ్రాములకుమించి చక్కెర తీసుకోకూడదు. కానీ భారతీయ ఆహారపు అలవాట్లు, రోజువారీ వినియోగం వల్ల చాలామంది సిఫార్సు చేసిన పరిమితి కంటే రెట్టింపు మోతాదులో చక్కెరను రోజూ తీసుకుంటున్నారు.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జీవనశైలి మార్పులు, ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్ వినియోగం పెరగడం దీనికి ప్రధాన కారణం. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో దాగి ఉండే హిడెన్ షుగర్ వల్ల ప్రజలు తమకు తెలియకుండానే మోతాదుకు మించి చక్కెరను పొందుతున్నారు.
ఈ అధిక వినియోగం దేశ ప్రజారోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తుంది. భారత్ ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా మారడానికి ఇది ప్రధాన కారణం. అధిక చక్కెర కేవలం టైప్ 2 మధుమేహానికి మాత్రమే కాక ఊబకాయం, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, దంత క్షయం వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.




