Reading Time: 3 minutes
కూత ఘనం.. ఖర్చు మరింత ఘనం! దశాబ్దాలుగా కలివి కోడి కోసం సాగుతున్న వేట

పిట్ట కొంచెం… కూత ఘనం అంటారు. కానీ ఈ పిట్ట విషయంలో కూతే కాదు… దాని కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కూడా ఘనమే! అరుదైన ఈ పక్షి కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ, వేలాది ఎకరాల అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగుతున్నాయి. కెమెరాలు పెట్టారు… శబ్దాలను రికార్డు చేస్తున్నారు… పక్షి అరుపుల కోసం రాత్రింబవళ్లు గాలిస్తున్నారు. అయినా ఆ అరుదైన పక్షి జాడ మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ఇంతకీ ఆ పక్షి ఏంటి అనుకుంటున్నారా? అదే… కడప జిల్లా లంకమల అభయారణ్యానికి ప్రతీకగా నిలిచిన కలివికోడి… జెర్డాన్స్ కోర్సర్!

నేలపైనే ఎక్కువ సంచారం

కలివికోడి లేదా జెర్డాన్స్ కోర్సర్ అత్యంత అరుదైన పక్షి. ఇది ఎక్కువగా ఎగరదు. నేలపైనే నడుస్తూ సంచరిస్తుంది. అందులోనూ రాత్రివేళల్లో ఎక్కువగా తిరుగుతుందని భావిస్తున్నారు. పొదలు, గడ్డి, రాళ్ల మధ్య కలిసిపోయే దీని రంగు కారణంగా గుర్తించడం మరింత కష్టమవుతోంది. అందుకే ఇంత పెద్ద స్థాయిలో పరిశోధనలు జరిగినా… ఈ పక్షి ఆచూకీ అంత సులభంగా దొరకడం లేదు.

1848లో తొలి గుర్తింపు

1848లో బ్రిటిష్ సైనిక వైద్యాధికారి, పక్షిశాస్త్రవేత్త థామస్ సి. జెర్డాన్ ఈ అరుదైన పక్షిని తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు అడపాదడపా కనిపించినట్లు రికార్డులు ఉన్నాయి. 1900 ప్రాంతంలో హోవర్డ్ క్యాంబెల్ కూడా దీనిని గమనించినట్లు చెబుతారు. ఆ తర్వాత కలివికోడి ఒక్కసారిగా తెరమరుగైంది.

దీంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS), అమెరికాకు చెందిన స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలు ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పరిశోధనలు చేపట్టాయి. అనేక ప్రాంతాలను క్షుణ్ణంగా గాలించినా ఫలితం దొరకలేదు. దీంతో పక్షిశాస్త్రవేత్తలు ఈ పక్షిని దాదాపు అంతరించిపోయిన జాతిగానే భావించడం ప్రారంభించారు. జెర్డాన్ చేసిన తొలి గుర్తింపుకు గౌరవంగా ఈ పక్షికి ‘జెర్డాన్స్ కోర్సర్’ అనే పేరు పెట్టారు.

సలీం అలీ అన్వేషణ… ఫలించని ప్రయత్నాలు

కలివికోడి కోసం అన్వేషణలో ప్రపంచ ప్రఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ కూడా భాగమయ్యారు. ఈ పక్షి ఆచూకీ కోసం ఆయన పలు ప్రాంతాల్లో పరిశోధనలు చేశారు. పక్షి నమూనాలు, బొమ్మలను అటవీ అధికారులకే కాకుండా అడవుల్లో వేటకు, కలప కోసం వెళ్లే స్థానికులకు కూడా అందించారు. ఎక్కడైనా ఈ పక్షి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేశారు. BNHS తరఫున పరిశోధకుడు భరత్ భూషణ్ కూడా కలివికోడి కోసం తీవ్రంగా గాలించారు. కానీ సంవత్సరాలు గడిచినా ఆ పక్షి ఆచూకీ మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

గొర్రెల కాపరి కంటపడిన అరుదైన జంట!

అయితే 1986 జనవరి 5న కథలో కీలక మలుపు వచ్చింది. కడప జిల్లా రెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరి ఐతన్న రెండు అరుదైన పక్షులను గమనించాడు. పోస్టర్లలో చూసిన పక్షితో అవి పూర్తిగా పోలి ఉండటాన్ని గుర్తించాడు. వాటిలో ఒక పక్షిని బంధించి తన ఇంటికి తీసుకువచ్చి అధికారులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పరిశోధకుడు భరత్ భూషణ్ దాన్ని పరిశీలించి, అది కలివికోడేనని నిర్ధారించినట్లు చెబుతారు. వెంటనే ఈ సమాచారం సలీం అలీకి చేరింది. జనవరి 9 నాటికి సలీం అలీ అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే విషాదం చోటుచేసుకుంది. బంధించిన పక్షి నీరు, ఆహారం తీసుకోకుండా బలహీనపడి… ఆయన చేరుకునేలోపే ప్రాణాలు విడిచింది. ఆ పక్షి మృతదేహాన్ని పరిశోధన కోసం మ్యూజియంలో భద్రపరిచారు. ఈ అరుదైన పక్షి గురించి సమాచారం ఇచ్చిన ఐతన్న సేవలకు గుర్తింపుగా అటవీ శాఖలో చిన్న ఉద్యోగం కూడా ఇచ్చినట్లు చెబుతారు.

లంకమలే ప్రధాన ఆవాసం

కలివికోడి ఆవాస ప్రాంతంగా కడప జిల్లా లంకమల అభయారణ్యాన్ని అత్యంత కీలక ప్రాంతంగా గుర్తించారు. ఈ అరుదైన పక్షి సంరక్షణ కోసం విస్తృత ప్రాంతాన్ని రక్షిత జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలోని పొదలు, పొడి అడవులు, గడ్డి మైదానాలు, రాళ్లతో కూడిన భూభాగం కలివికోడికి అనువైన నివాసంగా భావిస్తున్నారు.

ట్విక్… టూ… ట్విక్… టూ..

కలివికోడి గురించి అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో దాని కూత ఒకటి. పరిశోధకులు దీని అరుపును కూడా రికార్డు చేసినట్లు చెబుతున్నారు. ట్విక్-టూ… ట్విక్-టూ…అంటూ ఇది అరుస్తుందని పరిశోధనల్లో నమోదైంది. నవంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో దీని అరుపు ఎక్కువగా వినిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అరుపును చిన్న రికార్డింగ్ పరికరాల్లో భద్రపరచి, స్థానికులకు వినిపిస్తూ ఎక్కడైనా ఇటువంటి శబ్దం వినిపిస్తే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ ప్రచారం చేసింది.

రాత్రివేళలే అసలు వేట!

ప్రస్తుతం లంకమల అభయారణ్య ప్రాంతంలో కలివికోడి కోసం ప్రత్యేకంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ పక్షి సంచరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తూ పరిశోధకులు ఆ సమయంలోనే ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అడవిలో వినిపించే పక్షుల శబ్దాలను రికార్డు చేసి వాటిని విశ్లేషణ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు.

అంతేకాదు.. అటవీ ప్రాంతంలో అనేక కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. పక్షి సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. శబ్ద రికార్డింగ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రైవేట్ పరిశోధనా సంస్థల సహకారంతో సర్వేలు నిర్వహిస్తున్నారు. అయినా దశాబ్దాలుగా కలివికోడి ఉనికిని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు దొరకడం పరిశోధకులకు సవాలుగా మారింది.

కోట్ల ఖర్చు… పక్షి జాడ మాత్రం ప్రశ్నార్థకం!

ఈ అరుదైన పక్షి సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. ఆవాస ప్రాంతాల సంరక్షణతో పాటు, అటవీ ప్రాంతానికి సమీపంలోని కొన్ని ప్రైవేటు భూములను కూడా సేకరించి ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేసినట్లు సమాచారం. కలివికోడి ఆవాస పరిరక్షణ, పరిశోధన, భూముల సేకరణ, కెమెరా ట్రాప్‌లు, శబ్ద రికార్డింగ్‌లు, శాస్త్రీయ సర్వేలు… ఇలా ఇప్పటివరకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేశారు. వేలాది ఎకరాల పరిధిలో సాగుతున్న ఈ పరిశోధన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

‘గత ఏడాది వాయిస్ రికార్డు వినిపించింది’

అటవీ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, గతంలో కొన్ని సందర్భాల్లో కలివికోడి అరుపును పోలిన శబ్దాలు రికార్డయ్యాయి. వాటిపై కూడా నిపుణులు మరింత పరిశోధన చేస్తున్నారు. అయితే వాయిస్ రికార్డు ఆధారంగా మాత్రమే ఆ పక్షి ఉనికిని నిర్ధారించడం సాధ్యం కాదు. స్పష్టమైన ఫొటో, వీడియో లేదా ఇతర శాస్త్రీయ ఆధారాలు అవసరం.

మళ్లీ కనిపిస్తుందా?

1948 నుంచి 1986 మధ్యకాలంలో కడప–నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కలివికోడి కనిపించినట్లు రికార్డులు ఉన్నాయి. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపించినట్లు నివేదికలు వెలువడ్డాయి. కానీ ఆ జాతి ప్రస్తుతం ఎక్కడ, ఎంత సంఖ్యలో ఉందన్నది మాత్రం ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే ఉంది. కలివికోడి కోసం సాగుతున్న అన్వేషణ ఇప్పుడు కేవలం ఒక పక్షి కోసం చేసే పరిశోధన మాత్రమే కాదు… అంతరించిపోతున్న ఒక జీవజాతిని తిరిగి కనుగొనే ప్రయత్నం.

పిట్ట చిన్నదే కావచ్చు… కానీ దాని కోసం సాగుతున్న ప్రయత్నం మాత్రం చిన్నది కాదు. ఒకప్పుడు అంతరించిపోయిందని భావించిన కలివికోడి కోసం శాస్త్రవేత్తలు, అటవీ శాఖ, పరిశోధనా సంస్థలు దశాబ్దాలుగా వెతుకుతూనే ఉన్నాయి. కెమెరాలు పెట్టారు… శబ్దాలు రికార్డు చేశారు… వేలాది ఎకరాలను జల్లెడ పట్టారు… కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు… అయినా కలివికోడి మాత్రం ఇంకా ఓ మిస్టరీగానే ఉంది!

మరి… లంకమల అడవుల్లో ఎక్కడైనా ఆ అరుదైన పక్షి ఇంకా బతికే ఉందా? లేక కలివికోడి అన్వేషణ చరిత్రలోనే ఒక అంతులేని కథగా మిగిలిపోతుందా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.