Reading Time: 2 minutes
Alia Bhatts Film Dont Be Shy To Stream On Amazon Prime Video

Don’t Be Shy: అలియా భట్ తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌పై తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి నిర్మించిన మూవీ ‘డోంట్ బి షై’. శ్రీతి ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందింది. ఇందులో అలియా భట్ నటించలేదు. అయితే నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు. కొత్త కథలు, కొత్త నటీనటులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పడు ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ని కూడా ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘డోంట్ బి షై’ కథ ప్రధానంగా నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. స్నేహం, ప్రేమ, బ్రేకప్, భవిష్యత్తుపై కలలు, కుటుంబంతో సంబంధాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే గందరగోళం వంటి అంశాలను కథలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ రొమాంటిక్ కామెడీ ‘డోంట్ బి షై’ థియేటర్లలో కాకుండా, నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. 2026 సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేటర్ రిలీజ్ లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. యూత్ కాన్సెప్ట్ తో వస్తున్న కథ కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఆరుషి బజాజ్, బియాంకా అరోరా, పీయూష్ ఖతి, అన్ష్ దుగ్గల్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు కునాల్ రాయ్ కపూర్, అనురాగ్ బసు, నేహా ధూపియా, అంజు అల్వా నాయక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొత్త నటులతోనే ఈ మూవీని తెరకెక్కించడం విశేషం.

ఇదిలా ఉంటే నటిగా అలియా భట్ కూడా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’లో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె నటిస్తున్నారు. అలాగే ‘బ్రహ్మాస్త్ర 3’, ‘తుంబాడ్ 2’ వంటి ప్రాజెక్టులు కూడా ఆమె లైనప్‌లో ఉన్నాయి. ఆమె నటించిన ‘ఆల్ఫా’ కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన ఈ సినిమా ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే, మరోవైపు నిర్మాతగా అలియా భట్ ప్రయాణంలో ‘డోంట్ బి షై’ మరో ఆసక్తికరమైన అడుగుగా మారింది. మరి థియేటర్లను పక్కనపెట్టి నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఈ యూత్‌ఫుల్ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో సెప్టెంబర్ 25న తేలనుంది.