Reading Time: 2 minutes
చైనా-నేపాల్ సరిహద్దులో ప్రళయం..భయం గొలిపే వీడియో..133 మంది భారతీయులు గల్లంతు

బుధవారం నేపాల్‌లోని రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా పలే  గ్రామాలు నీట మునిగాయి, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.  ప్రమాదంలో కనీసం 98 మంది మృతి చెందగా, 133 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలతో సహా దాదాపు 500 మంది గల్లంతయ్యారు.

సీసీటీవీ వీడియోలో ఎగువ నుండి బురద నీరు, బండరాళ్లు వేగంగా దూసుకొచ్చి పార్కింగ్ స్థలాన్ని ముంచెత్తడం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోతుండగా, దట్టమైన ధూళి కమ్ముకుంది. ఈ క్లిప్ లో ప్రజలు భయంతో పరుగులు తీయడం, క్షణాల వ్యవధిలోనే వరద వారిని ముంచెత్తడం, సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారడం కనిపించింది.

ప్రకృతి విపత్తు ప్రభావం చైనాను తాకింది. టిబెట్‌లోని చైనా-నేపాల్ సరిహద్దులో కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం సంభవించింది. నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి.  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయక చర్యలకు ఆదేశించారు.

అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం 9 గంటల ప్రాంతంలో టిబెట్ వైపు నుండి భోటేకోషి నదిలో ఈ వరద పోటెత్తింది. దీని వల్ల టిబెట్‌ను ఆనుకుని ఉన్న రసువా, ధాడింగ్ జిల్లాలు అలాగే కాట్మాండుకు నైరుతిలో ఉన్న నువాకోట్ జిల్లాలు ప్రభావితమయ్యాయి. నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం, వరద ప్రభావిత ప్రాంతం నుంచి 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ జాతీయలతో సహా కనీసం 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిసింది.

ఈ ప్రయాణికులలో 133 మంది భారతీయ పర్యాటకులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలు కాగా, మిగిలిన పర్యాటకులు అమెరికా, మలేషియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా,  నెదర్లాండ్స్‌కు చెందినవారు. సమ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, గల్లంతైన వారిలో కనీసం 59 మంది కైలాస మానససరోవర యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు.

నేపాల్ ఆర్మీ స్పందిస్తూ.. హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ సిబ్బందిని సహాయక చర్యల నిమిత్తం రంగంలోకి దించింది. నేపాల్ పోలీసులు, ఇతరులు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో, టిబెట్‌ను ఆనుకుని ఉన్న జిల్లాల్లోని పర్వత లోయల గుండా బురద నీరు ఉప్పొంగుతున్న దృశ్యాలు భయపెడుతున్నాయి.

నేపాల్ పోలీసు ప్రతినిధి అభి నారాయణ్ కాఫ్లే మీడియాతో మాట్లాడుతూ, ఆస్తి నష్టం ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదనీ నది ఒడ్డున ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

నేపాల్‌కు సరిహద్దులో ఉన్న బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు కేంద్రం అడ్వైజరీలు జారీ చేసింది. గండక్‌ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని  నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించింది.

మరోవైపు, మెరుపు వరదలకు సంబంధించి ముందస్తు వార్నింగ్ ఇవ్వడంలో చైనా విఫలమైందనే ఆరోపణలు నేపాల్‌లో వినిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలలోని రవాణా మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్, టెలికాం వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చైనా అధికారిక రెస్క్యూ టీమ్‌లు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి.  అయితే పర్వత ప్రాంతాలు కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి.


జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే రుతుపవనాల వర్షాలు దక్షిణ ఆసియా అంతటా ప్రాణాంతక వరదలు, కొండచరియలు విరిగిపడటానికి  కారణమవుతున్నాయి. గతేడాది జూలైలో గ్యిరాంగ్ పోర్ట్ సమీపంలో సంభవించిన వరద ప్రవాహంలో 17 మంది గల్లంతయ్యారు.