Reading Time: < 1 minute

కంపెనీల ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారు..యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి అత్యవసర మీటింగ్

Caption of Image.
  •     ఆఫీసర్లపై యాదాద్రి కలెక్టర్​ అనురాగ్ ​జయంతి ఆగ్రహం 

యాదాద్రి, వెలుగు:  కంపెనీల్లో రియాక్టర్లు పేలి కార్మికుల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారని పీసీబీ, ఫ్యాక్టరీ, ఫైర్​ ఆఫీసర్లపై యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని  దోతిగూడెంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్​ పేలి ముగ్గురు కార్మికులు చనిపోవడంతో కలెక్టరేట్​లో మంగళవారం అత్యవసర మీటింగ్​ ఏర్పాటు చేశారు. వరుసగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా సీరియస్​గా తీసుకోరా? అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తమైతే సీరియస్​ యాక్షన్​ ఉంటుందని హెచ్చరించారు. 

ఫార్మా పరిశ్రమల్లోని రియాక్టర్ల పనితీరుతో పాటు ప్రొడక్ట్​ శాంపిల్స్​ను సేకరించి టెస్ట్​లు నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమల యాజమాన్యాలు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టంగా చేపట్టేలా  చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ కన్సల్టెంట్ ద్వారా భద్రతా ధ్రువీకరణ పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాలోపాలపై చేపట్టిన చర్యల రిపోర్ట్​ను పది రోజుల్లోగా అందించాలన్నారు. ప్రజలు, కార్మికుల ప్రాణ రక్షణ విషయంలో రాజీపడేదీ లేదన్నారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కర్​రావు, ఆర్డీవో శేఖర్​ రెడ్డి, ఫ్యాక్టరీస్​ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, జిల్లా పరిశ్రమలు అధికారి పడాల రవీందర్ ఉన్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.