
భారతీయ సమాజంలో ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో మహిళల పట్ల ఉన్న పాతకాలపు భావనలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అంటే ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం కాదని.. భార్యను ఇంటి పనులు చేయడానికి నియమించుకున్న ఉద్యోగిగా చూడలేమని స్పష్టం చేసింది. భార్య పుట్టింటికి వెళ్లాలన్నా, అత్తమామలను సేవించాలన్నా భర్త అనుమతి తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదని తేల్చిచెప్పింది. మహిళల ఆత్మగౌరవాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను అద్దం పడుతూ జస్టిస్ చిల్లకూరు సుమలత ఇచ్చిన ఈ తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
భర్త వాదనపై హైకోర్టు ఆగ్రహం:
బెంగళూరు రూరల్ జిల్లాకు చెందిన సతీష్ అనే వ్యక్తి తన భార్య, కూతురికి ఫ్యామిలీ కోర్టు నెలకు రూ. 9వేలు ఇవ్వాలని ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు సదరు భర్త. తన భార్య ఇంటి పనులు చేయడం మానేసిందని, తన తల్లిదండ్రులను చూసుకోవడం లేదని, తన అనుమతి లేకుండానే తరచూ పుట్టింటికి వెళ్తోందని భర్త తన పిటిషన్‌లో ఆరోపించాడు. ఈ వాదనను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. భర్త మాటలు చూస్తుంటే భార్యను ఏదో ఇంట్లో పనులు చేయడానికి పెట్టుకున్న నౌకర్లా భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని కోర్టు మండిపడింది.
పుట్టింటికి వెళ్లడానికి భర్త అనుమతి ఎందుకు?
భార్య పుట్టింటికి వెళ్లాలంటే భర్త, అతని కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి అనే భావనను హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. మహిళలు తమ తల్లిదండ్రులను చూడాలన్నా ఇతరుల అనుమతి ఎందుకు తీసుకోవాలని కోర్టు నిలదీసింది. ఒక మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలనే కోరికను తీర్చుకోవడానికి భర్త పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. భార్య ప్రవర్తనను, కోరికలను పూర్తిగా నియంత్రించాలనే దుర్బుద్ధే ఇలాంటి ఆంక్షలకు కారణమని కోర్టు అభిప్రాయపడింది.
ఇంటి పనులు, అత్తమామల సేవపై స్పష్టమైన తీర్పు:
ఇంటి పనుల బాధ్యత కేవలం మహిళలదే కాదని, భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా పంచుకోవాలని హైకోర్టు హితవు పలికింది. అలాగే వృద్ధులైన అత్తమామలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా వారి సొంత కొడుకు, కూతురిదేనని.. కోడలిపై ఆ బాధ్యతను బలవంతంగా రుద్దలేమని స్పష్టం చేసింది. అత్తమామలకు సేవ చేయడం అనేది పూర్తిగా స్వచ్ఛందంగా జరగాలి తప్ప, దాన్ని బలవంతంగా రుద్దడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరైనది కాదని కోర్టు స్పష్టం చేసింది.
ALSO READ : కోటి జీతం ఉన్నా అమెరికా వేస్ట్..
పెళ్లి అంటే సమానత్వం:
వివాహ బంధం అనేది కేవలం లాంఛనాలతో ముడిపడినది కాదని.. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం, సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుందని కోర్టు పేర్కొంది. లింగ వివక్ష కారణంగా మహిళల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయాలని చూస్తే అది రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్పూర్తికి విరుద్ధమని తేల్చిచెప్పింది. రోజుకు భార్య, కూతురికి ఒక్కొక్కరికీ రూ.150 చొప్పున కూడా భరణం చెల్లించలేనని భర్త కోరడంలో అర్థం లేదని పేర్కొంటూ.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.