
బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ యాడ్ ప్రస్తుతం ఎంత దుమారం రేపుతుందో అందరికీ తెలిసింది. కృతి సనన్ వస్త్రధారణపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే అసహజంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కంగనాకు గట్టిగానే కృతి సనన్ కౌంటర్ ఇచ్చారు. అనంతరం ఇది పొలిటికల్ టర్నర్ తీసుకుంది. కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జోక్యం పుచ్చుకుని కృతి సనన్‌కు మద్దతు తెలిపారు. అది ఆమె ఇష్టమని వ్యాఖ్యానించారు. ఇలా ఈ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకోవడంతో గివా జువెలరీ అప్రమత్తమైంది. యాడ్‌ను తొలగిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.
ప్రకటనలో కృతి సనన్ ధరించిన దుస్తులు, రక్షాబంధన్ పండుగను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గివా జువెలరీ (GIVA Jewellery’ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకటనను అన్ని మీడియా వేదికల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను తాము గౌరవిస్తామని స్పష్టం చేసింది. “మా తాజా ప్రకటన అనుకోకుండా సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసి ఉంటే.. అది మా ఉద్దేశం కాదు. అందరి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు ప్రకటనను అన్ని మీడియా వేదికల నుంచి ఉపసంహరించుకున్నాం” అని సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.
అసలు వివాదం ఏంటి?
రక్షాబంధన్ సందర్భంగా రూపొందించిన ఈ ప్రకటనలో కృతి సనన్ తన సోదరుడు, పెంపుడు కుక్కతో కలిసి పండుగను జరుపుకుంటున్నట్లు చూపించారు. GIVA పెట్ కలెక్షన్‌లో భాగంగా రూపొందించిన ఈ యాడ్‌లో.. కృతి తన పెంపుడు కుక్కకు రాఖీ కడుతున్నట్లు చూపించారు. పెంపుడు జంతువులు కూడా కుటుంబంలో భాగమే అనే భావనను ఈ ప్రకటన ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. అయితే కృతి సనన్ ధరించిన దుస్తులపై, అలాగే సంప్రదాయ రక్షాబంధన్ వేడుకలో పెంపుడు కుక్కను చేర్చడంపై కొందరు సోషల్ మీడియా యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
తన దుస్తులపై వస్తున్న విమర్శలకు కృతి సనన్ మంగళవారం స్పందించారు. పండుగల గొప్పతనం దుస్తుల్లో కాకుండా.. వాటి వెనుక ఉన్న భావోద్వేగం, సంప్రదాయాల్లో ఉంటుందని పేర్కొన్నారు. రక్షాబంధన్‌ను “రక్షణ బంధం”గా అభివర్ణించిన కృతి.. తాను, తన సోదరి ఒకరికొకరు రాఖీ కట్టుకుంటామని తెలిపారు. సోదరుడు ఎలా రక్షిస్తాడో.. తాము కూడా ఒకరినొకరు అలాగే రక్షించుకోగలమని అన్నారు. ఒకరి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కోసం తాము చేసే ప్రార్థనలు తమ పెంపుడు కుక్కలకు కూడా వర్తిస్తాయని.. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తామని చెప్పారు.
కృతికి రాహుల్ గాంధీ మద్దతు
ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. కృతి సనన్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ నిలిచారు. కృతి స్పందనను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఆయన.. “ఒక మహిళ ఏం ధరిస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె ఇష్టం. తమ స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపండి” అని పేర్కొన్నారు. దీనికి #SmashThePatriarchy అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఇటీవల పుణెలో నిర్వహించిన మహిళలతో కూడిన ‘చాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలోనూ రాహుల్ గాంధీ ఇదే నినాదాన్ని ఉపయోగించారు.
రాహుల్ వ్యాఖ్యలపై కంగనా ఫైర్
మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ స్పందించారు. బీజేపీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి రాహుల్ వ్యాఖ్యలను విమర్శిస్తూ చేసిన పోస్టును కంగనా రీషేర్ చేశారు. “బ్రో, వెయిట్. భారత్ మాతా కీ జై. ప్రారంభిద్దాం” అంటూ కంగనా వ్యాఖ్యానించారు. బీజేపీ పోస్టులో మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, షా బానో కేసు వంటి అంశాలను ప్రస్తావిస్తూ మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించారు.
గతంలోనూ ఇలాంటి వివాదమే..
సెలబ్రిటీల నగల ప్రకటనలు వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022లో అక్షయ తృతీయ సందర్భంగా నగల బ్రాండ్ కోసం చేసిన ప్రకటనపై నటి కరీనా కపూర్ కూడా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ ప్రకటనలో బంగారు నగలతో మెరిసిన కరీనా నుదుటిపై బొట్టు పెట్టుకోకపోవడంపై కొందరు సోషల్ మీడియా యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌ను సంస్థే ఉపసంహరించుకోవడంతో.. సోషల్ మీడియాలో మొదలైన వివాదం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.
