Reading Time: < 1 minute

రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం ఇయ్యాలి : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

Caption of Image.
  •     రాష్ట్రంలో ‘ఫసల్ బీమా’ను పక్కాగా అమలు చేయాలి
  •     సెక్రటేరియెట్ ముందు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆందోళన 

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామన్న సర్కారు హామీ ఏమైందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుల ఖాతాల్లో ఆ పైసలు జమ చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ఆదిలాబాద్ రైతులతో కలిసి ఆయన సోమవారం సెక్రటేరియెట్ వద్ద ఆందోళకు దిగారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన చాంబర్‌‌లో కలిసి రైతుల ఇబ్బందులపై వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అప్పట్లో ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని సర్కారు గొప్పలు చెప్పిందని, కానీ ఇంతకాలం గడుస్తున్నా ఆ మాటను నిలబెట్టుకోలేదని చెప్పారు. సర్కారు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. తక్షణమే పరిహారం పైసలు రైతుల అకౌంట్లలో వేయాలన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని  ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన ఈ స్కీమ్ ఉంటే భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు వచ్చినా అన్నదాతలకు పటిష్టమైన బీమా రక్షణ దొరుకుతుందన్నారు. 

©️ VIL Media Pvt Ltd.