
‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ అంటూ రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమాలోని పాట ఇటీవల ప్రేక్షకులను, అయ్యప్ప భక్తులను ఆకట్టుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అయ్యప్ప దీక్ష, భక్తి, కుటుంబ భావోద్వేగాలు కథలో భాగంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ‘ఇరుముడి కట్టు’ పాటలో అయ్యప్ప భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చూపించారు. సినిమా టైటిల్ విన్న వెంటనే చాలామందికి ఓ ప్రశ్న రావచ్చు. అసలు ఇరుముడి అంటే ఏమిటి? అందులో ఏం పెడతారు? తలపై మోసుకుని శబరిమల ఎందుకు వెళ్తారు?
ఇరుముడి అంటే ఏమిటి?
‘ఇరుముడి’ అనే పదంలోనే దాని అర్థం ఉంది. ఇరు అంటే రెండు.. ముడి అంటే మూట. రెండు భాగాలుగా కట్టే పవిత్ర మూట కావడంతో దీనికి ఇరుముడి అనే పేరు వచ్చింది. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు శబరిమల యాత్రలో ఇరుముడిని తలపై ధరించి తీసుకెళ్తారు. ఇది కేవలం ప్రయాణంలో సామాను మోసుకెళ్లడానికి ఉపయోగించే మూట కాదు. అయ్యప్ప స్వామికి సమర్పించాల్సిన పూజా ద్రవ్యాలను కూడా ఇందులో తీసుకెళ్తారు.
ఇరుముడిలో రెండు భాగాలు
ఇరుముడిని సాధారణంగా మున్ముడి, వెన్ముడి అనే రెండు భాగాలుగా విభజిస్తారు. మున్ముడిలో ప్రధానంగా స్వామికి సమర్పించాల్సిన వస్తువులు ఉంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది నెయ్యి కొబ్బరికాయ.కొబ్బరికాయలోని నీటిని తొలగించి, అందులో నెయ్యి నింపుతారు. శబరిమలకు చేరుకున్న తర్వాత ఆ నెయ్యిని అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం కోసం సమర్పిస్తారు. అందుకే నెయ్యి కొబ్బరికాయకు ఇరుముడిలో ప్రత్యేక స్థానం ఉంది.
మరి నెయ్యి కొబ్బరికాయకే అంత ప్రాధాన్యం ఎందుకు?
అయ్యప్ప భక్తుల సంప్రదాయంలో నెయ్యి కొబ్బరికాయను ఎంతో పవిత్రంగా భావిస్తారు. కొబ్బరికాయను సమర్పించడం ద్వారా తనలోని అహంకారాన్ని, చెడు భావాలను విడిచిపెట్టి స్వామికి తనను తాను సమర్పించుకోవాలనే ఆధ్యాత్మిక భావనను భక్తులు అనుసంధానిస్తారు. ఇరుముడిలో బియ్యం, కొబ్బరికాయలు, కర్పూరం, పూజా సామగ్రి, నైవేద్యానికి సంబంధించిన వస్తువులు తదితరాలను కూడా సంప్రదాయం ప్రకారం ఉంచుతారు.
వెన్ముడిలో ఏం ఉంటుంది?
ఇరుముడిలోని రెండో భాగమైన వెన్ముడిలో యాత్రికుడికి అవసరమైన వస్తువులను ఉంచుతారు. అంటే.. ఒక భాగం స్వామికి సమర్పణ కోసం, మరో భాగం యాత్రికుడి అవసరాల కోసం. ఈ రెండు భాగాలే ఇరుముడి ప్రత్యేకతను తెలియజేస్తాయి.
18 పవిత్ర మెట్లతో సంబంధం
శబరిమల యాత్రలో ఇరుముడికి మరో ప్రత్యేకత ఉంది. ఇరుముడిని ధరించి వచ్చే భక్తులకు పతినెట్టాంపడి.. అంటే 18 పవిత్ర మెట్లు ఎక్కడం ఎంతో ప్రాధాన్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. తలపై ఇరుముడితో భక్తులు ఆ 18 మెట్లు ఎక్కే దృశ్యం శబరిమల యాత్రలో అత్యంత ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది.
అందుకే రవితేజ సినిమా ‘ఇరుముడి’ టైటిల్ వినగానే అది కేవలం సినిమా పేరు మాత్రమే కాదని అర్థమవుతుంది. దాని వెనుక అయ్యప్ప భక్తి, దీక్ష, సమర్పణ, శబరిమల యాత్ర అనే గొప్ప ఆధ్యాత్మిక భావన ఉంది.
తెరపై రవితేజ ‘ఇరుముడి’ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపితే.. నిజ జీవితంలో అయ్యప్ప భక్తుడి తలపై ఉండే ఇరుముడి మాత్రం భక్తి, నియమం, విశ్వాసం, సమర్పణకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే.. తలపై కనిపించేది ఒక మూటే అయినా, అయ్యప్ప భక్తుడి దృష్టిలో అది స్వామిని చేరే పవిత్ర ప్రయాణానికి గుర్తు.
గమనిక: ఇరుముడిలో ఉండే కొన్ని వస్తువులు ప్రాంతీయ ఆచారాలు, గురుస్వామి సూచనలు, సంప్రదాయాలను బట్టి మారవచ్చు.