Reading Time: 2 minutes
హార్ముజ్ లో భారతీయ నౌకను బ్లాక్ లిస్ట్ లో చేర్చిన ఇరాన్

హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో ఈ సముద్ర మార్గానికి ఎంతో కీలకమైన స్థానం ఉంది. హర్ముజ్‌పై ఇరాన్‌కు గణనీయమైన నియంత్రణ ఉంది.  అమెరికా సైనిక దిగ్భంధనంతో  ఒత్తిడి పెంచుతోంది. దీంతో జలసంధి మీదుగా నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.

ఈ నేపథ్యంలో హర్ముజ్‌పై తన పట్టు క్రమంగా తగ్గుతోందని ఇరాన్ గుర్తించింది. దీంతో జలసంధిపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు కొత్త వ్యూహాన్ని రచించింది. హర్ముజ్ పై తన పట్టు కోల్పోలేదంటూ సంకేతాలు ఇచ్చేలా తాజాగా భారత్‌కు చెందిన ‘మహా రూస్’ నౌక సహా మొత్తం 45 నౌకలను బ్లాక్‌లిస్ట్ లో చేర్చింది. ఈ జాబితాలో పాకిస్థాన్ జెండాతో తిరిగే ‘మర్దాన్’ అనే ముడి చమురు ట్యాంకర్ కూడా ఉంది.

ఇటీవలి కాలంలో ఇరాన్ చెప్పే మార్గం కాకుండా, ఒమన్ తీరానికి దగ్గరగా ఉన్న వేరే మార్గంలో నౌకలు వెళ్తున్నాయి. ఇటీవల హర్ముజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గాన్నే ఎంచుకున్నాయి. అమెరికా నౌకాదళం భద్రత కల్పిస్తుండటంతో ఆ మార్గంలో నౌకల రాకపోకలు పెరిగాయి. దీనివల్ల హర్ముజ్ జలసంధిపై  పట్టు సడలుతోందని ఇరాన్ భావిస్తోంది. అదే సమయంలో నౌకల నుండి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది.

ఇరాన్ నిర్దేశిత మార్గాలను పాటించని నౌకలపై జరిమానాలు విధించడం, లేదా వాటిని సీజ్ చేయడం జరుగుతుందని పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ స్పష్టం చేసింది.  బ్లాక్‌లిస్ట్ చేసిన నౌకలకు భవిష్యత్తులో హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే అనుమతి ఉండదు. నిషేధం తొలగించుకోవడానికి సంబంధిత యజమానులు తగిన వివరణతో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దాడుల బారిన పడిన నౌకలు

మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ తనదైన షిప్పింగ్ కారిడార్‌ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. ఇరాన్ బ్లాక్‌లిస్ట్ చేసిన 45 నౌకలలో కనీసం 14 నౌకలు ఇప్పటికే జలసంధి ప్రాంతంలో జరిగిన వివిధ దాడి ఘటనల్లో దెబ్బతిన్నాయి. వీటిలోని చాలా నౌకలు యూఏఈ దేశానికి చెందిన కంపెనీలవే కావడం గమనార్హం.

హర్ముజ్ గుండా వెళ్లే నౌకలకు భద్రత, పర్యావరణ సేవలు, ఇంధన సరఫరా, బీమా అందించినందుకు ఇరాన్ ఫీజులు వసూలు చేస్తుంది. హర్ముజ్‌లో ప్రయాణించడానికి అధికారికంగా అనుమతి ఉన్న దేశాల నౌకల నుంచే ఈ రుసుములు వసూలు చేస్తోంది.