
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అధికార టీవీకే-ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా చెన్నై సమీపంలోని పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం తమిళనాడు అభివృద్ధిని అనేక సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుందని విమర్శించారు. దీన్ని రాష్ట్ర అభివృద్ధికి “తిరిగి సరిదిద్దలేని ఎదురుదెబ్బ”గా అభివర్ణించారు.

తమిళనాడు అసెంబ్లీలో సోమవారం సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. పరందూర్‌లో కొత్త విమానాశ్రయం ఏర్పాటు కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ భూములు, రైతుల జీవనోపాధిని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరందూర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్‌లో సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది.

విజయ్ నిర్ణయంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. పరందూర్ ప్రాజెక్టును రద్దు చేయడం మార్పు కాదని.. ఇది తమిళనాడు అభివృద్ధికి కోలుకోలేని ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. “పరందూర్ ప్రాజెక్టును రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుంది. స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం తమిళనాడు ప్రయోజనాలను పణంగా పెట్టకూడదు” అని స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. రాష్ట్ర రాజధాని చెన్నైకి ప్రపంచ స్థాయి విమానాశ్రయం ఎంతో అవసరమని అన్నారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల నుంచి ఆటోమొబైల్ రంగం వరకు తమిళనాడు దేశంలో అగ్రస్థానంలో ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి అత్యవసరమని పేర్కొన్నారు.
అసెంబ్లీలో డీఎంకే వాకౌట్
ఇక విజయ్ ప్రకటన తమిళనాడు అసెంబ్లీలో రాజకీయ దుమారం రేపింది. ప్రాజెక్టు రద్దుపై చర్చకు అనుమతి ఇవ్వాలని డీఎంకే ఎమ్మెల్యేలు కోరగా.. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అనుమతించలేదు. దీంతో ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. రూల్ 110 కింద ఇంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించడం, దానిపై చర్చకు లేదా సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఇవ్వకపోవడం ఆందోళన కలిగించే విషయమని స్టాలిన్ అన్నారు. పరందూర్ ప్రాంతాన్ని అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాతే ఎంపిక చేశామని స్టాలిన్ తెలిపారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని చెప్పారు.
విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుందని స్టాలిన్ విమర్శించారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో తమిళనాడు పెట్టుబడిదారులకు తొలి గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధి లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ లేదా 1.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడం సాధ్యం కాదన్నారు. ఎలాంటి ముందుచూపు, ప్రణాళిక, సంప్రదింపులు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు యువత ఉద్యోగ కలలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శించారు.
ఎందుకు వివాదాస్పదమైంది?
పరందూర్‌లో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం తమిళనాడులో అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటిగా ప్రణాళిక రూపొందించారు. చెన్నై భవిష్యత్ విమాన రవాణా అవసరాలను తీర్చేలా దీన్ని అభివృద్ధి చేయాలని భావించారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 10 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 2022లో అప్పటి డీఎంకే ప్రభుత్వం సుమారు రూ.27,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రకటించింది. అయితే స్థానిక రైతులు, పర్యావరణ కార్యకర్తలు అప్పటి నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు కోసం గుర్తించిన 5,369 ఎకరాల్లో దాదాపు 47.6 శాతం సారవంతమైన సాగుభూమి ఉందని.. అక్కడ ఏడాదికి మూడు పంటలు పండుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు ప్రాంతంలో దాదాపు నాలుగో వంతు చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరులతో కూడి ఉందని పేర్కొన్నారు. చిత్తడి నేలలపై రన్‌వే నిర్మించడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
వ్యతిరేకించిన విజయ్
విజయ్ కూడా గతంలో పరందూర్ ప్రాజెక్టును వ్యతిరేకించారు. 2025 జనవరిలో కాంచీపురం ప్రాంతంలో నిరసన చేస్తున్న గ్రామస్థులను ఆయన కలిశారు. ప్రకృతి, పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా ప్రాజెక్టు ఉంటే తాను వ్యతిరేకిస్తానని అప్పట్లో స్పష్టం చేశారు. అయితే చెన్నై విమానయాన అవసరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదని సీఎం విజయ్ తాజాగా తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రాంతంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు కోసం త్వరలో సమగ్ర ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న చెన్నై విమానాశ్రయాన్ని విస్తరించేందుకు తక్షణ చర్యలు చేపడతామని వెల్లడించారు.
Dropping Parandur is not Change. It’s an irreversible setback for Tamil Nadu’s growth
The announcement made today by the Hon’ble Chief Minister of Tamil Nadu to drop the Parandur International Airport project will set the State’s development back by several years. Tamil Nadu’s… pic.twitter.com/QHZdVdK21L
— M.K.Stalin (@mkstalin) August 24, 2026