
- గతంలో ఏర్పడిన కరువును ఎదుర్కొనేందుకు డ్రిప్ వైపు మొగ్గు
- 100 మంది రైతుల్లో 99 మంది డ్రిప్ సాగు
- ఒక్క ఎకరా నీటితో నాలుగు ఎకరాలు పారిస్తున్న రైతులు
- తగ్గిన కూలీలు, ఎరువుల ఖర్చులు
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రమంతా సాగుకు ఇబ్బందులు ఎదురవుతుంటే.. వరంగల్ జిల్లాలోని ఓ ఊరిలో మాత్రం ఎటు చూసినా పచ్చటి పంట పొలాలే కనిపిస్తున్నాయి. ఎల్ నినో వంటి వర్షాభావ పరిస్థితులను గతంలోనే చూసిన ఆ గ్రామ రైతులు.. శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించారు. ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్ పద్ధతికి జై కొట్టారు. ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ తక్కువ నీటితో వివిధ రకాల పంటల సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని జీడికల్ గ్రామ రైతులు.
వరంగల్/నల్లబెల్లి, వెలుగు : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని జీడికల్ గ్రామంలో సుమారు 70 ఇండ్లు ఉండగా 100 మంది రైతులున్నారు. గ్రామ పరిధిలో 300 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. కొన్నేండ్ల కింద కరువు కారణంగా గ్రామంలోని బావులు, బోర్లు ఎండిపోయి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు బతుకు దెరువు కోసం వలసలు వెళ్లారు.
ఈ క్రమంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గ్రామానికి చెందిన రైతు చెల్పూరి రాజమౌళి మొట్టమెదటగా డ్రిప్ సాగు కోసం తన పొలంలో పైపులు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఆయన దారిలో కూరపాటి సమ్మయ్య, పూలకాని దుర్గయ్య వంటి రైతులు నడవడంతో మిగతా రైతులూ ముందుకొచ్చారు. ప్రస్తుతం గ్రామంలోని 100 మంది రైతుల్లో 99 మంది డ్రిప్ పద్దతిలోనే సాగు చేస్తున్నారు.
తక్కువ నీటితో వాణిజ్య పంటలు
ఈ గ్రామంలో సాధారణంగానే వర్షాభావ పరిస్థితులు ఉండగా.. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో జీడికల్ రైతులు వాణిజ్య పంటలైన పత్తి, పసుపు, అరటి, ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేశారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం ప్రభుత్వం ఇచ్చే 90 శాతం సబ్సిడీని వినియోగించుకుంటూ ప్రతి మొక్క వద్దకు పైపులు వేశారు. దీంతో గతంలో గంట పాటు బోరు పోస్తే అర ఎకరం సాగు జరుగగా… ప్రస్తుతం డ్రిప్ పద్ధతిలో అదే నీటితో నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు. ఇతర గ్రామాల రైతులతో పోలిస్తే కేవలం 40 శాతం నీటితోనే పంటలు పండిస్తున్నారు.
తగ్గిన కలుపు, ఎరువుల ఖర్చు
డ్రిప్ విధానంలో వ్యవసాయం చేస్తున్న జీడికల్ గ్రామ రైతులు వాణిజ్య పంటల్లోనూ మేలు రకం పంటల వైపు అడుగులు వేస్తున్నారు. అధికారుల సూచన మేరకు ఆర్మూర్ రకం పసుపు సాగు చేస్తున్నారు. అదేసమయంలో కలుపు ఖర్చులు, ఎరువుల బరువు తగ్గించుకున్నారు. గతంలో సాగు కోసం ఎరువులు వేయగా.. బోర్ నీటిలో అది కొట్టుకుపోయేది. దీంతో మళ్లీ మళ్లీ ఎరువుల బస్తాలు తీసుకురావాల్సి వచ్చేది. దీనికి తోడు మొక్కల చుట్టూరా కలుపు పెరిగేది. కానీ ప్రస్తుతం డ్రిప్ విధానంతో ఒక్కో చుక్క నీరు మొక్క వేర్ల భాగానికి అందుతోంది. కలుపు పెరిగే అవకాశాలు లేకపోవడంతో కూలీల ఖర్చులు సైతం తగ్గాయి. గతంలో రెండు బస్తాల ఎరువులు వాడాల్సిన చోట ఇప్పుడు కేవలం ఒక్క బస్తా ఎరువే సరిపోతోంది. ఎరువులను సైతం డ్రిప్ నీటిలో కలిపి అందించడం ద్వారా డైరెక్ట్ గా మొక్కకు చేరి దిగుబడి పెరుగుతోంది.
మా ఊరిలో ఎల్ నినో ప్రభావం ఉండదు
మా వ్యవసాయం మీద ఎల్ నినో ప్రభావం ఉండదు. ఇతరులు 100 శాతం నీటితో చేసే సాగును మేము 40 శాతం నీటితోనే చేస్తున్నం. ఈ సారి నిజామాబాద్ కమ్మరిపల్లి నుంచి ఆర్మూర్ రకం పసుపు తీసుకొచ్చి పెట్టిన. రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేసిన. వర్షాలు లేకున్న బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితోనే పంట సాగవుతోంది. అరగంట నడిచే బోరు నీటితో నాలుగు ఎకరాల పంట పండిస్తున్నం.
– చెల్పూరి రాజమౌళి
గతంలో పది గుంటలు కూడా పారలే..
మాకు మూడెకరాల భూమి ఉంది. నీళ్లు ఎంత పారించినా సాగుకు సరిపోకపోయేది. గతంలో పది గుంటలు కూడా సాగు కాలే. ఇప్పుడు నీటిని పొదుపుగా వాడుతూ పంటలు పండిస్తున్నం.
– సీహెచ్.మల్లికాంబ