
- మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ప్రణాళిక, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ, ఆపరేషన్ లోపాలే కారణం
- ‘అన్నారం, సుందిళ్ల’కూ మధ్యంతర భద్రతా చర్యలు చేపట్టాలని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలో తలెత్తిన లోపాలకు ప్రణాళిక, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ, ఆపరేషన్‌లోని లోపాలు కలిసికట్టుగా కారణమయ్యాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించింది. బ్యారేజీని పునరుద్ధరించిన తర్వాతే తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సిఫారసు చేసినట్లు తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, వినియోగ సాధ్యాసాధ్యాలపై న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ అఫిడవిట్ దాఖలైంది. మేడిగడ్డలో పియర్ కుంగిపోవడానికి గల కారణాలను పరిశీలించేందుకు 2023 అక్టోబర్ 22న ఎన్‌డీఎస్‌ఏ ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అక్టోబర్ 23 నుంచి 25వ తేదీ వరకు బ్యారేజీని పరిశీలించి నవంబర్ 1న నివేదిక సమర్పించింది. మేడిగడ్డతో నిర్మాణ, డిజైన్ పరంగా సారూప్యతలు ఉన్నందున అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా అత్యవసరంగా పరిశీలించాలని సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో మూడు బ్యారేజీలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు మాజీ సీడబ్ల్యూసీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 2024 మార్చి 2న మరో కమిటీ ఏర్పాటైంది. ఇందులో సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, సీఎస్‌ఎంఆర్‌ఎస్, ఐఐటీ ఢిల్లీ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 2025 మార్చిలో తుది నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండాలని తామే రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశామని చెప్పింది. ప్రాజెక్టును వినియోగంలోకి తేవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టెక్నికల్ నిపుణులు తగిన చర్యలు తీసుకున్నాకే ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలంది. ప్రాజెక్టుల వినియోగం, నీటి వినియోగం వంటి అంశాలు పూర్తిగా విధాన నిర్ణయాలని, వీటి విషయంలో ఎన్‌డీఎస్‌ఏ జోక్యం చేసుకోబోదని తేల్చి చెప్పింది.
పునరుద్ధరణ పూర్తయ్యే దాకా మేడిగడ్డను ఆపరేట్ చేయొద్దు
మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు దాన్ని ఆపరేట్ చేయవద్దని నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్లు ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ హైకోర్టుకు తెలిపాయి. నిర్మాణంపై హైడ్రాలిక్ ఒత్తిడిని తగ్గించేందుకు వర్షాకాలానికి ముందే బ్లాక్–7 గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని సూచించింది. పియర్ నంబర్ 20కు అత్యంత సమీపంలో దెబ్బతిన్న గేట్లు 20, 21ను అవసరమైతే పూర్తిగా తొలగించాలని, మిగిలిన ఆరు గేట్లను కూడా పూర్తిగా తెరిచి ఆ స్థితిలో పటిష్టంగా బిగించాలని సూచించినట్లు వివరించింది. ఏదైనా గేటును పూర్తిగా ఎత్తడం సాధ్యం కాకపోతే దానిని తొలగించాలని సిఫారసు చేసినట్లు తెలిపింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా మధ్యంతర భద్రతా చర్యలు సూచించినట్లు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టినప్పుడు వాటిని పర్యవేక్షించేందుకు కేంద్ర జల వనరుల శాఖ 2026 జూన్ 30న సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని సీడబ్ల్యూసీ తెలిపింది. ఎన్ డీఎస్‌ఏ చట్టబద్ధ విధులను నిర్వర్తించలేదన్న ఆరోపణలను తిరస్కరిస్తూ, నిర్దిష్ట బ్యారేజీ భద్రత, మరమ్మతులపై ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎస్‌వో) దేనని స్పష్టం చేసింది. కాళేశ్వరం నుంచి రైతులకు సాగునీరు అందకపోవడం, వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఇబ్బందులు విధానపరమైన అంశాలని, నీటి సరఫరా, ప్రాజెక్టు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయాలని కేంద్రం పేర్కొంది. నీటిని నిల్వ చేయడం, దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం వంటి నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసింది.