Reading Time: 2 minutes
తిరుమలలో ఇక ఆ వంటకాలకు బ్రేక్.. నేటి నుంచి కొత్త నిబంధనలు!

తిరుమలకు వచ్చే భక్తులకు ఇకపై గోబీ వంటకాలు అందుబాటులో ఉండకపోవచ్చు. క్యాలీఫ్లవర్‌లో పురుగులు వస్తున్నాయంటూ భక్తుల నుంచి తరచూ ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఆరోగ్య విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాలీఫ్లవర్‌తో తయారయ్యే గోబీ రైస్, గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాలను తిరుమల కొండపై ఉన్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నిలిపివేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది.

తిరుమలలో ప్రస్తుతం సుమారు 162 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, 7 జనతా కాంటీన్లు, 5 పెద్ద కాంటీన్లు ఉన్నాయి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు నిర్వహించగా కొన్ని చోట్ల క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో టీటీడీ హెల్త్ వింగ్ అప్రమత్తమైంది.

వారం రోజుల క్రితం హోటల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ క్యాలీఫ్లవర్ వినియోగంపై చర్చించారు. ఈ సీజన్‌లో క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని, సరైన పద్ధతిలో శుభ్రం చేయకుండా వంటల్లో ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిర్వాహకులకు వివరించారు. భక్తుల నుంచి కూడా ఈ విషయంపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తు చేశారు.

దీంతో క్యాలీఫ్లవర్‌తో తయారయ్యే వంటకాలను నిలిపివేయడం మంచిదని టీటీడీ ఆరోగ్య విభాగం సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైనీస్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో గోబీ రైస్, గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాలకు మంచి డిమాండ్ ఉండేది. అయినప్పటికీ భక్తుల ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హోటల్ నిర్వాహకులు కూడా ఆరోగ్య శాఖ సూచనలను పాటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై తిరుమల కొండపై ‘గోబీ’ అనే మాటే వినిపించకపోవచ్చన్న చర్చ జరుగుతోంది.

ఇక తిరుపతి నుంచి తిరుమలకు సరఫరా అయ్యే కూరగాయల్లో క్యాలీఫ్లవర్ చేరకుండా చూడాల్సిన బాధ్యత కూడా పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘా పెట్టాల్సి రావచ్చని భావిస్తున్నారు.

అయితే తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రంలో క్యాలీఫ్లవర్ వినియోగంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. నిత్యం రెండు లక్షల మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా, రోజుకు దాదాపు 20 టన్నుల కూరగాయలు టీటీడీకి ఉచితంగా అందుతున్నాయి. దాతలు ఇచ్చే కూరగాయల్లో అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ కూడా చేరుతోంది.

టీటీడీ ఆరోగ్య విభాగం ప్రస్తుతం హోటల్ నిర్వాహకులకు మాత్రమే ఇచ్చిన సూచనలను అన్నదానం విభాగం కూడా అమలు చేయాలా వద్దా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. టీటీడీ అధికారికంగా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటే అన్నదానంలో కూడా క్యాలీఫ్లవర్ వినియోగాన్ని నిలిపివేస్తామని అన్నదానం విభాగం అధికారులు చెబుతున్నారు.

భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా క్యాలీఫ్లవర్‌పై పూర్తిస్థాయి నిషేధం అమల్లోకి వస్తే, దాతల నుంచి కూడా ఆ కూరగాయను స్వీకరించకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్నదానంలో అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్‌తో కూర తయారు చేస్తున్న నేపథ్యంలో, టీటీడీ తీసుకోబోయే తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. పూర్తిస్థాయి నిషేధం అమలైతే ఇకపై క్యాలీఫ్లవర్ తిరుమల కొండకే చేరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.