Reading Time: < 1 minute
Duleep Trophy Vaibhav Sooryavanshi Takes Two Wickets In One Over

Duleep Trophy: ఐపీఎల్‌ సూపర్‌ స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీ అంటేనే బ్యాటింగ్‌.. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులు సృష్టించడమే కాదు.. అవార్డుల పంట కూడా పండింది.. అయితే, తన బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ మ్యాజిక్‌ చేయగలను అంటున్నాడు.. ఈ యూనివర్సల్‌ బేబీ బాస్.. దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బంతితో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని మరింత కష్టాల్లోకి నెట్టాడు.

నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 పరుగులకే ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ 467 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడింది. ఎడమచేతి వాటం స్లో ఆర్థడాక్స్ స్పిన్నర్ అయిన వైభవ్ 27వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు. ఓవర్ రెండో బంతికి కిషన్ లింగ్డోను 25 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఐదో బంతికి ఇమ్లివాటి లెమ్టూర్‌ను ఔట్ చేసి ఒకే ఓవర్‌లో రెండో వికెట్ సాధించాడు.

మొత్తంగా వైభవ్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 6 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి ఔట్‌ అయిన విషయం విదితమే.. ఇక, నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఆధిపత్యం కొనసాగుతోంది.