
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), జర్మన్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ పోర్షే ఏజీకి చెందిన కన్సల్టెన్సీ సబ్సిడరీ ఎంహెచ్‌పీలో 100 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. డీల్ విలువ 320 మిలియన్ యూరోలు (సుమారు రూ.3,574 కోట్లు). నియంత్రణ సంస్థల ఆమోదాలకు లోబడి రాబోయే 3–-4 నెలల్లో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి కానుంది. ఎంహెచ్‌పీలో దాదాపు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 2025లో ఇది 742 మిలియన్ యూరోల టర్నోవర్‌ను నమోదు చేసింది.
టీసీఎస్, పోర్షేకు మధ్య ఇప్పటికే 1.25 బిలియన్ యూరోల (దాదాపు రూ.14 వేల కోట్ల) విలువైన ఐదేళ్ల స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కుదిరింది. ఇందులో భాగంగా పోర్షే కోసం ప్రత్యేకంగా ‘ఏఐ మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను టీసీఎస్ ఏర్పాటు చేయనుంది. పోర్షేకి చెందిన తయారీ, ఇంజనీరింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ విభాగాల్లో ఏఐ వాడకాన్ని ఈ సెంటర్ చూసుకుంటుంది.