
ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. సరిహద్దు మూసివేతతో ఆగిన పెళ్లిళ్లకు మంచి మూహూర్తం దొరికింది. భారత యువకులను పెళ్లి చేసుకునేందుకు పాక్ సింధీయువతులకు లైన్ క్లియర్ అయింది. భారత్ కు చెందిన యువకులతో నిశ్చితార్థం అయి ఆపరేషన్ సింధూర్ తో పెళ్లిళ్లు ఆగిపోయిన చాలా కాలం తర్వాత వారు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.150 మంది పాక్ సింధీ యువతులకు భారత్ ప్రవేశించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
గతేడాది ఆపరేషన్ సింధూర్ తో పాక్, ఇండియా మధ్య భూతల వాఘా, అట్టారి సరిహద్దు మూసివేయడంతో పాక్ సింధీ యువతుల పెళ్లిళ్లు ఆగిపోయాయి. భారత యువకులతో పెళ్లి నిశ్చయం అయిన పెళ్లి కోసం ఆ యువతులంతా ఎదురు చూడాల్సి వచ్చింది. భారత్ కు వచ్చేందుకు వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో వీసాలు నిరాకరించింది కేంద్ర హోంశాఖ. అయితే తాజాగా నిబంధనలను సడలించడంతో పాక్ సింధీ యువతులు భారత్ యువకులను పెళ్లి చేసుకునేందుకు లైన్ క్లియర్ అయింది.
మూడు దేశాల నుంచి రవాణా మార్గాల ద్వారా భారత్ లో ప్రవేశించేందుకు పాకిస్తానీ వధువులకు ,వారి బంధువులకు వీసాలు మంజూరు చేసింది. మస్కట్, దుబాయ్, శ్రీలంక, ఇతర సరిహద్దు దేశాల మీదుగా విమానాల ద్వారా భారత్ కు వచ్చేందుకు అనుమతిచ్చింది. దీంతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 150 మంది పాక్ సింధీ వధువులు భారత్ కు చేరుకున్నారు.
కొన్నేళ్లు పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ కు చెందిన కొన్ని కుటుంబాలు తమ పిల్లలకు భారత్ లో పెళ్లిళ్లు చేసేందుకు వీసా, వాఘా అట్టారీ సరిహద్దు ద్వారా ఇండియాకు వచ్చేవారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతా మారిపోయింది. వాఘా సరిహద్దుద్వారా భారత్ కు రావాలనుకున్న వారికి వీసా తిరస్కరించింది ప్రభుత్వం. దీంతో చాలా మంది యువలకు పెళ్లిళ్లు భారత యువకులతో నిశ్చితార్థం అయి ఆగిపోయాయి.
వీసా సేవలు నిలిచిపోవడంతో పాకిస్తాన్ లోని ప్రావిన్స్ ఘోట్కీలో ప్రముఖ హిందూ మత పుణ్య క్షేత్రం షదానీ దర్బార్ అథ్యాత్మిక గురువు అయిన యుధిష్టిర్ లాల్ షదానీని అక్కడి సింధీ ప్రజలు సంప్రదించడంతో ఆయన భారత యువకులతో పెళ్లి కుదుర్చుకున్న పాకిస్తానీ యువతుల లిస్టును తయారు చేశారు.
భారత్ నాగ్ పూర్, రాయ్ ఫూర్, జోధ్ పూర్ , పూణె వంటి నగరాల్లో దాదాపు 150 మంది వధువులకు పెళ్లి కావాల్సి ఉంది. ఈ లిస్టుతో హోంశాఖ ను షదానీ సంప్రదించి వీసాలు ఇప్పించాలని కోరారు. దీంతో సరిహద్దు ద్వారా కాకుండా విమానంలో ఇతర పొరుగు దేశాల గుండా భారత్ లో ప్రవేశించేందుకు హోంశాఖ అనుమతించింది. పాకిస్తాన్ లో ఇలాంటి మహిళలు మరో 300 మంది ఎదురు చూస్తున్నారని వారికి కూడా వీసాలు జారీ చేయాలని భారత్ ప్రభుత్వాన్ని కోరారు షదానీ.