Reading Time: < 1 minute

నార్సింగిలో అర్ధరాత్రి కలకలం.. బీర్ ఇవ్వలేదన్న కోపంతో.. బార్‌ సిబ్బందిపై తల్వార్‌తో దాడికి యత్నం

Caption of Image.

గ్రేటర్ సైబరాబాద్‌ పరిధిలోని నార్సింగిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌లో అనుమతి సమయం ముగిసిందని చెప్పినందుకు సిబ్బందిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లలమ్మ గార్డెన్‌ పైప్‌లైన్‌ రోడ్డులో ఉన్న ట్యాగెస్పో బార్‌’కు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అయితే సమయం ముగియడంతో బార్‌ సిబ్బంది వారికి బీర్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు వ్యక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి బయటకు వెళ్లారు.

బార్ బయటకు వెళ్లిన ఆ వ్యక్తులు మరో వ్యక్తికి ఫోన్‌ చేసి పిలిపించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి తల్వార్‌తో వచ్చిన ఆ వ్యక్తి నేరుగా బార్‌ సిబ్బందిపై దాడికి యత్నించాడు. దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య తోపులాట, తీవ్ర ఘర్షణ చెలరేగింది.ఈ దాడిలో బార్‌ సిబ్బంది శ్రవణ్‌కు స్వల్ప గాయాలు కాగా, మహేశ్‌ అరచేతికి రక్తస్రావంతో కూడిన గాయమైంది. ఈ ఘర్షణలో దుండగులు తెచ్చిన తల్వార్‌ కూడా వంగిపోయినట్లు సమాచారం. అనంతరం నిందితులంతా స్కూటీపై అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారైన నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.