Reading Time: 2 minutes
Off The Record About Minister Seethakka Silent On Konda Surekha Row Whats Behind It

Off The Record: కొండా కుటుంబం కేంద్రంగా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత పటేల్‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి మీద చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌ హీట్‌ పెంచేశాయి. వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం ఖాయమని, కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇవ్వకుంటే…. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని క్లారిటీగా చెప్పేశారు సుస్మిత. పరకాల నుంచి మళ్లీ రేవూరినే గెలిపించాలంటూ సీఎం ఎలా మాట్లాడతారంటూ ఆయన పరిధిని కూడా ప్రశ్నించారామె. అదే గీసుకొండ వేదిక మీది నుంచి సీఎం సోదరుల ప్రస్తావన కూడా తీసుకురావడం సొంత కాంగ్రెస్‌ పార్టీలోనే కలకలం రేపింది. అలాగే… పచ్చ కాంగ్రెస్‌ అన్న సుస్మిత వ్యాఖ్యలతో పొలిటికల్ ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ సీనియర్స్, ఎమ్మెల్యేలు కొండా ఫ్యామిలీకి ఉమ్మడి కౌంటర్స్‌ ఇచ్చేశారు. ఏకంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని కూడా డిమాండ్‌ చేశారు వరంగల్ కాంగ్రెస్‌ లీడర్స్‌. ఒకరు కాదు, ఇద్దరు కాదు… వాళ్ళు వీళ్ళు అని లేకుండా… ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలంతా ఒక్కతాటి మీదికి వచ్చి… సుస్మిత వ్యాఖ్యలను ఖండించడంతో పాటు మంత్రి మీద చర్యల కోసం వత్తిడి పెంచారు.

ఇక ఇదే సమయంలో కుల రాజకీయాలు జోరందుకున్నాయి. బీసీ వర్గానికి చెందిన నేతలంతా ఏకమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారట. ఆ రకంగా మంత్రి సురేఖకు మద్దతు తెలిపే వారి సంఖ్య కూడా పెరుగుతూ… రెండు వర్గాలుగా తయారవుతోంది. మంత్రి రాజీనామా చేయాలని ఒక శిబిరం, బీసీలను అణగదొక్కుతున్నారంటూ మరో శిబిరం జిల్లాలో పొలిటికల్‌ మోహరింపులు మొదలుపెట్టాయి. సరిగ్గా… ఇక్కడే ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి ప్రస్తావన వస్తోంది. ఈ ఎపిసోడ్‌పై మంత్రి సీతక్క ఇంత వరకు ఒక్క స్టేట్‌మెంట్‌ కూడా ఎందుకు ఇవ్వలేందటూ కాంగ్రెస్‌ వర్గాలే చర్చించుకుంటున్నాయి. మామూలుగా అయితే… సీఎం రేవంత్‌, మంత్రి సీతక్కది బలమైన బంధం అని చెబుతారు. అక్కా తమ్ముళ్ళ బంధం అంత బలంగా ఉన్నా… సుస్మిత రేవంత్‌ను అలా మాట్లాడుతున్నా…. సీతక్క కనీస మాత్రం కూడా ఎందుకు స్పందించలేదన్నది లోకల్‌ కాంగ్రెస్‌ కేడర్‌లో ఉన్న చాలా పెద్ద డౌట్‌. అసలు జిల్లా కాంగ్రెస్‌ మొత్తం ఒకవైపు, కొండా కుటుంబం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయినా సరే… సీతక్క అస్సలు నోరు తెరవకపోవడానికి కారణం ఏంటంటూ ఆరాలు తీసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది.

ఈ విషయంలో ఇప్పుడసలు సీతక్క ఎవరి వైపు ఉన్నారు? కొండా కుటుంబాన్ని సమర్ధిస్తున్నారా? లేక సీఎం శిబిరంలో ఉన్నట్టా? అంటూ జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలే పరస్పరం ప్రశ్నించుకుంటున్నారట. ఈ విషయంలో ఆమె కనీసం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడం ఏంటంటూ రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సీఎం రేవంత్ రెడ్డి అంటే వల్లమాలిన అభిమానం ప్రకటించే సీతక్క ఎందుకు రియాక్ట్‌ అవడం లేదన్న ప్రశ్నకు సమాధానాలు వెదుకుతున్నారు. వాస్తవానికి సీఎం వరంగల్ జిల్లా పర్యటన కోసం సీతక్క పట్టుపట్టారట. ములుగు జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణం పూర్తయింది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రావాలంటూ చాలా రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై సీతక్క చేసిన ఒత్తిడితోనే ఆయన జిల్లా పర్యటనకు వచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ క్రమంలోనే సీఎం ఈనెల 16న ములుగు జిల్లాలో పర్యటించి తర్వాత పరకాల పర్యటనకు వెళ్లిన రేవూరి ప్రకాశ్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రకటన చేయడంతో వివాదం మొదలైంది. ఇంత జరుగుతున్నా… సీతక్క స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొండా దంపతుల తీరుకు ఆమె భయపడుతున్నారా? లేక నా సబ్జెక్ట్‌ కాదు కాబట్టి ఇందులో వేలు పెట్టొద్దనుకుని దూరంగా ఉంటున్నారా అనే చర్చ ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌ శ్రేణుల్లో జరుగుతోంది. కారణం ఏదైనాగానీ…. సీఎంకు అత్యంత సన్నిహితురాలని చెప్పుకునే నాయకురాలు కనీస స్టేట్‌మెంట్‌ ఇవ్వకపోవడాన్ని మాత్రం కాస్త ప్రత్యేకంగానే చూడాలని అంటున్నాయి రాజకీయవర్గాలు.