Reading Time: < 1 minute
పిల్లల వార్డులో ఘోర అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 15 మంది నవజాత శిశువులు..!

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం (ఆగస్టు 26) ఉదయం సంభవించిన అగ్నిప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు మృతి చెందినట్లు రాయిటర్స్ పేర్కొంది. స్థానిక ప్రసార సంస్థ జియో టీవీ కథనం ప్రకారం.. ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులోని నర్సరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో 16 మంది నవజాత శిశువులు ఉన్నారు. వారిలో ఒక్కరిని మాత్రమే సురక్షితంగా రక్షించగలిగారు.

ఏసీ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు ఆసుపత్రికి చేరుకున్నాయి. ఆరు ఫైర్ ఇంజిన్లు, నాలుగు అంబులెన్సులతో సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకున్న అనంతరం ఘటనా స్థలంలో కూలింగ్ చర్యలు కొనసాగించారు.

ఆసుపత్రిలోని ఎంసీహెచ్ వార్డులో మూడో అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని జిల్లా యంత్రాంగం తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు అదనపు డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదానికి కారణాలు, భద్రతా లోపాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై కమిటీ విచారణ జరపనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…