
సినిమా టికెట్ ధరల స్థిరీకరణ, థియేటర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా నిబంధనలు టాలీవుడ్‌లో పెను దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని తక్షణమే రద్దు చేయాలని లేదా సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. టికెట్ రేట్లు, థియేటర్ల వర్గీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఎగ్జిబిటర్లు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా, 33 జిల్లాల్లోని సుమారు 400లకు పైగా థియేటర్ల ప్రతినిధులను కనీసం సంప్రదించకుండానే ప్రభుత్వం రాత్రికి రాత్రే జీవోను ఎలా విడుదల చేస్తుందని వారు ప్రశ్నించారు. కేవలం కొందరు బడా నిర్మాతలు, ‘తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ కు లబ్ది చేకూర్చేందుకే ఈ తరహా నిబంధనలు తీసుకొచ్చారా? అన్న అనుమానాలను ఎగ్జిబిటర్లు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 400కు పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా టైర్-2, టైర్-3 పట్టణాల విషయానికొస్తే.. అక్కడ ఉన్నవాటిలో 99 శాతం ఏసీ లేని (ఏయిర్ కూల్డ్) థియేటర్లే ఉండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 390కి పైగా ఎయిర్ కూల్డ్ థియేటర్లు, సుమారు 350కి పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు నడుస్తున్నాయి. కోవిడ్ లాక్‌డౌన్ దెబ్బకు కుదేలైన థియేటర్లను మళ్లీ గాడిలో పెట్టేందుకు తాము అప్పులు చేసి మరీ లక్షల రూపాయల పెట్టుబడితో ఆధునికీకరించామని వారు ఆ లేఖలో వాపోయారు. అటు పెరిగిపోయిన నిర్వహణ ఖర్చులు భరించలేక, ఇటు తగిన ఆదాయం రాక సతమతమవుతున్న తమకు ఈ కొత్త జీవో కోలుకోలేని దెబ్బ కొడుతుందని సింగిల్ స్క్రీన్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సినిమా హాళ్లపై ఆధారపడి సుమారు 20 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసమో రూపొందించిన ఈ కొత్త వర్గీకరణల వల్ల ఆ 20 వేల కుటుంబాల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందంటున్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, చిత్ర పరిశ్రమకు వెన్నెముకగా నిలిచే ఎగ్జిబిటర్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ జీవోను పునఃసమీక్షించి తగిన న్యాయం చేయాలని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది.