Reading Time: < 1 minute
Rangasthalam Fame Achanta Mahesh Act As A Hero In Shivalayam Movie

తెలుగు వెండితెరపై మరో భక్తి రస చిత్రం సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ముహూర్తపు కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్‌, కాంచన దీప్తి రెడ్డి ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్‌ రెడ్డి నంది దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

భక్తి, ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ శివాలయం సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దేవుని పటాల సమక్షంలో నిర్వహించిన ముహూర్తపు కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా తొలి సన్నివేశానికి దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

శివాలయం చిత్రంలో ఆచంట మహేష్‌, కాంచన దీప్తి రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఘర్షణ శ్రీనివాస్‌, లెంకల అశోక్ రెడ్డి, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, కుప్పిలి శ్రీనివాస చారి, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో కథను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వెంకట్‌ రెడ్డి నంది నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దరిపల్లి ప్రవీణ్ కుమార్‌, లెంకల అశోక్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని డ్రమ్స్ రాము అందిస్తుండగా.. నిహారిక చౌదరి కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివాలయం సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.