Reading Time: < 1 minute
Telangana Congress Konda Surekha Disciplinary Committee Report Mallu Ravi

TPCC Disciplinary Committee: తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ వేగం పెంచింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి నేతృత్వంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కమిటీ, ఈ వ్యవహారంపై కీలక నివేదికను సిద్ధం చేసి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్‌తో పాటు పీసీసీ (PCC)కి అందజేయనుంది. ముందుగా నేడు హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. అనంతరం క్రమశిక్షణ కమిటీ సభ్యులు మరొకసారి అన్‌ఫార్మల్ (అనధికారిక) సమావేశమై సురేఖ కుమార్తె సుష్మిత మాట్లాడిన వీడియో ఆధారాలు, మీడియా సమావేశాల క్లిప్పింగులను సునిశితంగా పరిశీలించారు.

కాంగ్రెస్ సిద్ధాంతాలు దాటి ముఖ్యమంత్రి, పార్టీపై వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని కమిటీ భావించింది. సురేఖ ఇచ్చిన వివరణతో పాటు వీడియోల రికార్డులను ఆధారంగా చేసుకుని, కొండా సురేఖపై తగిన చర్యలు తీసుకోవాలని రికమండ్ చేస్తూ కమిటీ నివేదికను రూపొందించింది. మరోవైపు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు సైతం వరుస ఎపిసోడ్లపై ఫిర్యాదులు చేస్తూ క్రమశిక్షణ కమిటీకి అప్పీల్ చేసుకున్నారు. సొంత పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ వరుస పరిణామాలన్నింటినీ సమగ్రంగా నివేదికలో పొందుపరచి, తదుపరి నిర్ణయం కోసం అధిష్ఠానానికి నివేదించనున్నారు.