Iron Rich Snacks: మన తాత ముత్తాతల ఆరోగ్యం.. ఈ ఒక్క స్నాక్‌తో మీ పిల్లలకు ఐరన్, కాల్షియం కొండంత బలం!

Iron Rich Snacks: మన పూర్వీకులు రాగులతో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోవడం వల్లే ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో జనాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి మళ్లీ సిరిధాన్యాల వాడకం పెరిగింది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రక్తహీనత, ఎముకల బలహీనత వంటి సమస్యలకు రాగులు ఒక సంజీవనిలా పనిచేస్తాయని పెద్దలు చెబుతున్నారు. మరి అంతటి పోషక విలువలున్న రాగి పిండితో ఎప్పుడూ ఒకే లాంటి టిఫిన్స్ తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే ఎప్పటిలాగా రాగి దోసా, రోటీ, సంకటి లాంటివి కాకుండా కేవలం కొద్ది నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన రాగి చెక్కలను ఎలా చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం…
కావలసిన పదార్థాలు:
రాగి పిండి
బియ్యం పిండి (చెక్కలు క్రిస్పీగా రావడం కోసం)
వేరుశెనగ పప్పులు (కొద్దిగా కచ్చాపచ్చాగా దంచినవి)
నువ్వులు
పచ్చిమిర్చి, అల్లం పేస్ట్
కరివేపాకు, కొత్తిమీర తరుగు
ఉప్పు (తగినంత)
వెన్న లేదా వేడి నూనె (పిండి కలుపుకోవడానికి)
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
తయారీ విధానం..
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో రాగి పిండి, కొద్దిగా బియ్యం పిండి తీసుకోండి. అందులో నువ్వులు, కచ్చాపచ్చాగా దంచిన వేరుశెనగ పప్పులు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఈ మిశ్రమంలో పచ్చిమిర్చి-అల్లం పేస్ట్, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేయండి. చెక్కలు సాఫ్ట్‌గా, క్రిస్పీగా రావడం కోసం కొద్దిగా వెన్న లేదా వేడి నూనె వేసి పిండిని బాగా ముద్దలా కాకుండా పొడిపొడిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా గోరువెచ్చని నీటిని పోస్తూ, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా (మరీ జారుడుగా కాకుండా) ముద్దలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ లేదా బట్టర్ పేపర్‌పై కొద్దిగా నూనె రాసి, ఈ ఉండలను చేత్తో పలచని చెక్కల్లా ఒత్తుకోవాలి. ఆపై కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా చక్కగా కాలే వరకు మీడియం ఫ్లేమ్‌పై డీప్ ఫ్రై చేయాలి. అంతే ఆరోగ్యకరమైన రాగి చెక్కలు రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు:
* రాగులలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, ఎనిమియా (రక్తహీనత) సమస్యను తగ్గిస్తుంది.
* ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూస్తుంది, దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి స్నాక్‌గా పని చేస్తుంది.
* ఈ టేస్టీ రాగి చెక్కలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే కనీసం 2-3 వారాల పాటు ఫ్రెష్‌గా, కరకరలాడుతూ ఉంటాయి.