
బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ శకం ముగిసింది. దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి కంటే మమతా బెనర్జీ అనుసరిస్తున్న మొండి వైఖరి ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ఘనవిజయం సాధించినా మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించడానికి నిరాకరించడం గమనార్హం. కనీసం సంప్రదాయబద్ధంగా గవర్నర్‌కు తన రాజీనామాను కూడా సమర్పించకుండా ఆమె మౌనం వహించారు. మే 9 శనివారం ఉదయం 11 గంటల వరకు ఆమె తన X (ట్విట్టర్) ప్రొఫైల్‌లో పశ్చిమ బెంగాల్ గౌరవనీయ ముఖ్యమంత్రి అని ఉంది.
ఇవాళ మే 9న బీజేపీ నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీదీ తన సోషల్ మీడియా బయోలో మార్పులు చేశారు. అయితే ఇక్కడే ఆమె తన చాకచక్యాన్ని ప్రదర్శించారు.
సాధారణంగా పదవి కోల్పోయిన వారు మాజీ ముఖ్యమంత్రి అని పోస్ట్ చేస్తారు. కానీ మమత బెనర్జీ మాజీ అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ విధానసభ) అని పోస్ట్ చేశారు.అంటే తాను ఆ మూడు విడతలకు ముఖ్యమంత్రిని అని అర్థం వచ్చేలా బయోను మార్చారు. ఇంతకు ముందు బయోలో కేవలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉండేది.
►ALSO READ | గేటెడ్ కమ్యూనిటీల ఆందోళనలకు చెక్.. క్యూఆర్ కోడ్ ఐడీలతో సెన్సస్ అధికారులు
దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మమత తన ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయకపోవడాన్ని తప్పుబడుతూ ఏకంగా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తున్నారు. కొందరైతే ఆమె అకౌంట్ ను బ్లాక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని, మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికి ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి తెర లేపింది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 సీట్లకు పడిపోయింది. ఈ ఘోర ఓటమి తర్వాత మమతా సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అనడంతో గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ఆమె పదవి అధికారికంగా పోయింది.