Reading Time: < 1 minute
Tamil Nadu Vck Press Meet On Support To Vijay Tvk Government Formation

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 6 రోజులు గడుస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడ లేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ అర్లేకర్ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.

సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 4 గంటలకు వీసీకే పార్టీ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో విజయ్‌కు మద్దతిచ్చేదా? లేదా? అన్నది స్పష్టం చేయనుంది. ఈ ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ మద్దతిస్తే విజయ్ ప్రమాణస్వీకారానికి అడ్డంకులు తొలగిపోతాయి. లేదంటే అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పటికే టీవీకే అధినేత విజయ్.. వీసీకే నేతలను కలిసి మద్దతు కోరారు.

అయితే వీసీకే డిప్యూటీ సీఎం పోస్ట్‌ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తిరుచ్చి ఈస్ట్ సీటు కూడా కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడే పంచాయితీ తెగడం లేదని సమాచారం. ఈ విషయంలో క్లారిటీ వస్తే మాత్రం విజయ్ ప్రమాణస్వీకారానికి అడ్డంకులు తొలగిపోయినట్లే.