Reading Time: < 1 minute
Telangana: ప్రకృతి ఒడిలో వికృత చేష్టలు.. ఖరీదైన 20 కార్లతో విన్యాసాలు.. ఇదిగో వీడియో!

కొందరు చేసే తింగరి పనుల కారణంగా పర్యాటక ప్రదేశాల్లో సైతం.. భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేర్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌ వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన కొందరు సందర్శకులు ఆ ప్రాంతాన్ని రేసింగ్ ట్రాక్‌గా మార్చి కార్లతో సంట్స్ చేస్తూ హల్చల్ చేశారు. దీంతో అక్కడికి వచ్చిన ఇతర పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చుట్టూ గుట్టలు.. మధ్యలో విశాలంగా విస్తరించిన మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడికి వచ్చే కొందరు సందర్శకులు ప్రకృతి అందాలను ఆస్వాదించాల్సింది పోయి.. వాహనాలతో ప్రమాదకర విన్యాసాలకు పాల్పడటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనలు పట్టించుకోకుండా వాహనాలతో విన్యాసాలు చేయడంతో.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయంతో వణికిపోయారు. ముఖ్యంగా బ్యాక్‌వాటర్‌ పరిసరాల్లో రహదారి పరిస్థితులు, గుట్టల ప్రాంతం, నీటి సమీపం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ప్రమాదం జరిగే వరకు వేచి చూడొద్దు

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న మిడ్‌మానేరు పరిసరాల్లో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను అడ్డుకునేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వాహనాలతో స్టంట్లు చేసే వారిపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బ్యాక్‌వాటర్‌ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులను అప్రమత్తం చేయడం, పోలీసుల పర్యవేక్షణ పెంచడం వంటి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకుల సరదా కోసం ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.