
వర్షకాలంలో వర్షం కురిస్తే చాలు.. ప్రయాణం చేయాలంటేనే వాహనదారులకు భయం పుడుతోంది. ముఖ్యంగా మన దేశంలోని ఐటీ హబ్‌లు, పెద్ద నగరాల్లో వర్షం పడిందంటే ట్రాఫిక్ జామ్‌లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల బాదుడు సామాన్యులకి చిరాకు తెప్పిస్తున్నాయి. తాజాగా గుర్గావ్‌లో ఇలాంటి ఘటనే ఒక మహిళకు ఎదురైంది. వర్షంలో కేవలం ఏడు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఒక ఆటో డ్రైవర్ రూ.800 డిమాండ్ చేయడంతో ఆమె షాకైంది.
గుర్గావ్‌కు చెందిన ఆస్థా గోయల్ అనే మహిళకు ఇటీవల ఇలాంటి విచిత్రమైన అనుభవమే ఎదురైంది. భారీ వర్షం పడుతున్న సమయంలో ఆమె బయటికి వెళ్లాల్సి వచ్చింది. దూరం కేవలం ఏడు కిలోమీటర్లే. రోడ్లన్నీ నీటితో తడిసి ముద్దయ్యాయి. ఆటో దొరకడమే కష్టంగా మారిన ఆ టైంలో ఒక ఆటో డ్రైవర్ ముందుకు వచ్చాడు. సరేలే అనుకుని గమ్యస్థానానికి ఎంత అని అడిగితే.. ఆ డ్రైవర్ చెప్పిన రేటు విని ఆస్థా మైండ్ బ్లాంక్ అయింది. కేవలం 7 కి.మీ. ప్రయాణానికి రూ. 800 ఇస్తేనే వస్తానని చెప్పాడు.
ఈ అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “గుర్గావ్, ఇదేం ప్రవర్తన భయ్యా?” అంటూ…. ట్రాఫిక్ కష్టాలకు పేరుగాంచిన బెంగళూరు పరిస్థితి కంటే ఇక్కడేం తక్కువ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే చాలు ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రజల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారని మండిపడింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు కూడా వారికీ ఎదురైన చేదు అనుభవాలను కామెంట్ల రూపంలో చెప్పుకొచ్చారు. “నేను కేవలం కిలోమీటరు కంటే తక్కువ దూరానికే రూ. 150 చెల్లించాల్సి వచ్చింది” అని ఒకరు చెప్పగా.., “సొంత వాహనం లేకపోతే గుర్గావ్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో బతకడం చాలా కష్టం” అని మరొకరు కామెంట్ చేశారు. మరో మహిళ స్పందిస్తూ.. “నేను కేవలం 3, 4 కిలోమీటర్లు వెళ్లేందుకే రూ. 500 చెల్లించా” అంటూ తన బాధను చెప్పుకుంది.
మొత్తానికి, వర్షం పడిందంటే చాలు నగరవాసులకు ఆనందం కంటే ఆటో, క్యాబ్ ఛార్జీల మోత గురించే ఎక్కువ టెన్షన్ పట్టుకుంటోంది. కష్టకాలంలో అవసరాన్ని దొరికిందే ఛాన్స్ అన్నట్టు డ్రైవర్లు ఇలా నిలువు దోపిడీ చేయడంపై సామాన్యులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.