
Hotel Key Card Secrets: హోటల్‌లో చెక్-ఇన్ చేయగానే పాతకాలపు ఇనుప తాళాలకు బదులుగా చేతిలో చిన్న ప్లాస్టిక్ ‘కీ కార్డ్’ ఇస్తారు. ఇది కేవలం తలుపులు తెరవడానికి లేదా ఫ్యాషన్ కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక పర్యాటకుల భద్రత, విద్యుత్ ఆదా, హోటల్ వ్యాపార రహస్యాలు దాగి ఉన్నాయి.
పాతకాలపు ఇనుప తాళాలు వాడేటప్పుడు అవి ఎక్కడైనా పోతే ఎవరైనా దుర్వినియోగం చేస్తారనే భయం వెంటాడేది. కీ కార్డుల విషయంలో ఆ ఆందోళన అస్సలు ఉండదు. పొరపాటున కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకుంటే, హోటల్ సిబ్బంది క్షణాల్లో కంప్యూటర్ సిస్టమ్ నుంచి పాత కార్డును రద్దు చేస్తారు. ఆ వెంటనే సరికొత్త డిజిటల్ కార్డును అందిస్తారు. పాత కార్డ్ దొరికినా దాంతో తలుపులు తెరవడం సాధ్యపడదు. దీనివల్ల రూమ్ లాక్ మార్చాల్సిన అవసరం లేకుండానే పర్యాటకులకు పూర్తి భద్రత లభిస్తుంది.
సమయం కాగానే ఆటోమేటిక్ డీయాక్టివేషన్..
హోటల్ కీ కార్డుల్లో ప్రత్యేకమైన డిజిటల్ కోడింగ్ విధానం ఉంటుంది. పర్యాటకులు హోటల్‌లో ఉండే సమయానికి తగినట్లుగా మాత్రమే ఈ కార్డు పనిచేస్తుంది. చెక్-అవుట్ సమయం ముగియగానే కార్డ్ ఆటోమేటిక్‌గా పనిచేయడం ఆగిపోతుంది. ఏ గదికి అయితే కోడింగ్ చేశారో ఆ గది తలుపు మాత్రమే దాంతో తెరుచుకుంటుంది. అనుమతి లేకుండా ఇతరులు గదిలోకి ప్రవేశించకుండా ఈ సాంకేతికత అడ్డుకుంటుంది.
ఒక్క కార్డుతో ..
ఈ ప్లాస్టిక్ కార్డ్ కేవలం గది తలుపును తెరవడానికే పరిమితం కాదు. పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లలో లిఫ్ట్ వాడటానికి, జిమ్, ఈత కొలను, స్పా లేదా ప్రైవేట్ లాంజ్‌ల్లోకి వెళ్లడానికి ఈ ఒక్క కార్డునే అనుమతి పత్రంగా ఉపయోగిస్తారు. ఏ పర్యాటకుడు ఏ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారో సులభంగా పర్యవేక్షించడానికి హోటల్ యాజమాన్యానికి ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది.
కరెంట్ బిల్లుల్లో భారీగా ఆదా..
గదిలోకి అడుగుపెట్టగానే తలుపు పక్కన ఉండే స్లాట్‌లో ఈ కీ కార్డును ఉంచితేనే గదిలోని లైట్లు, ఏసీ పనిచేస్తాయి. గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు కార్డును బయటకు తీయగానే కొద్ది సెకన్లలోనే గదిలోని విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. పర్యాటకులు బయటకు వెళ్లినప్పుడు లైట్లు, ఏసీలు అనవసరంగా తిరగకుండా కరెంట్ బిల్లులను వేల రూపాయల్లో ఆదా చేయడానికి ఈ స్మార్ట్ సిస్టమ్ దోహదపడుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..