
గచ్చిబౌలి, వెలుగు: డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి నగ్న వీడియోలతో బెదిరించి ఓ ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.61 లక్షలు కాజేసింది. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. కొండాపూర్‌కు చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి హింజ్ డేటింగ్ యాప్‌లో ఇషా అనే యువతి పరిచయమైంది.
కొద్దిరోజులు యాప్‌లో చాటింగ్ చేసుకున్న అనంతరం ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకొని వాట్సాప్‌లో మాట్లాడుకున్నారు. ఈ నెల 13న ఐటీ ఉద్యోగి ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతుండగా, యువతి అతడి నగ్న వీడియోను రికార్డు చేసింది. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించింది.
అనంతరం మరో వ్యక్తి కూడా ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడంతో భయపడిన ఉద్యోగి పలు దఫాలుగా రూ.3.61 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ మరో రూ.2.70 లక్షలు పంపించాలని యువతి డిమాండ్ చేయడంతో ఆమె నంబర్లను బ్లాక్ చేశాడు. ఆ తర్వాత గుర్తుతెలియని నంబర్ల నుంచి ఫోన్లు రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు.