Reading Time: 2 minutes
కవాసకి కొత్త ప్రయోగం..! కోర్లియో రోబోటిక్ గుర్రం ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా

పాపులర్ ఆటో కంపెనీ కవాసకి ఇప్పుడు సరికొత్త ప్రయోగం చేస్తోంది. చక్రాలతో కాకుండా నాలుగు కాళ్లతో నడిచే, హైడ్రోజన్ ఇంజిన్‌తో పనిచేసే ప్రత్యేకమైన ఆఫ్‌రోడ్ వెహికల్‌ను తయారు చేస్తోంది. దీనికి కోర్లియో అని పేరు పెట్టింది. చూడటానికి రోబోటిక్ గుర్రంలా కనిపించే ఈ మోడల్ భవిష్యత్ రవాణాకు కీలకంగా మారబోతోంది. కోర్లియో సాధారణ టూ వీలర్ కాదు.

ఇది నాలుగు కాళ్లతో ముందుకు కదిలే ఆఫ్‌రోడ్ మొబిలిటీ వెహికల్. ప్రతి కాలును విడివిడిగా కంట్రోల్ చేసేలా దీన్ని రూపొందించారు. అందువల్ల సాధారణ వాహనాలు వెళ్లలేని గుట్టలు, రాళ్లు, కఠినమైన ప్రాంతాల్లో కూడా ప్రయాణించేలా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. దీని వెనుక కాళ్లలో మోటార్‌సైకిళ్లలో ఉపయోగించే స్వింగ్‌ఆర్మ్ తరహా సాంకేతికతను ఉపయోగించారు.

కాళ్లు కదులుతున్నప్పుడు ఎదురయ్యే కుదుపులను తగ్గించడంతో పాటు, రైడర్ బాడీ స్థిరంగా ఉండేందుకు ఈ వ్యవస్థ సాయపడనుంది. పర్వత ప్రాంతాలు, రాళ్లతో నిండిన మార్గాలు, నీటి ప్రవాహాలు వంటి ప్రాంతాల్లో సాధారణ చక్రాల వాహనాలతో ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఉపయోగించడం కోసం కోర్లియోను అభివృద్ధి చేశారు. వాహనం కింద ఉన్న నేల పరిస్థితిని గుర్తించి నడిచే విధానాన్ని మార్చుకునేలా కంట్రోల్ సిస్టమ్ పనిచేస్తుంది. దీంతో సరిగా లేని నేలపై కూడా చక్కగా ముందుకు కొనసాగుతోంది.

హైడ్రోజన్ ఇంజిన్

కోర్లియోలో మరో ఆసక్తికరమైన అంశం దాని పవర్‌ట్రెయిన్. ఇందులో 150cc హైడ్రోజన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ నేరుగా వాహనాన్ని నడపకుండా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తుతో నాలుగు కాళ్లలో అమర్చిన యాక్యుయేటర్లు, వాహనంలోని ఇతర వ్యవస్థలు పనిచేస్తాయి. హైడ్రోజన్‌ను వాహనం వెనుక భాగంలో ప్రత్యేక క్యాన్లలో నిల్వ చేస్తారు. సంప్రదాయ ఇంధనం నింపే స్టేషన్లపై ఆధారపడకుండా, అవసరమైనప్పుడు ఈ హైడ్రోజన్ క్యాన్లను మార్చుకునే విధంగా వ్యవస్థను రూపొందించాలని కవాసకి భావిస్తోంది.

కోర్లియోను నడపడానికి స్టీరింగ్, సాధారణ హ్యాండిల్‌బార్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గుర్రంపై స్వారీ చేసినట్టుగా ఉంటుంది. రైడర్ కాళ్ల దగ్గర ఉండే రకాబులు, చేతులతో పట్టుకునే భాగాలు రైడర్ కదలికలను గుర్తిస్తాయి. ఆ సంకేతాలను కంట్రోల్ సిస్టమ్ విశ్లేషించి, ఏ కాలు ఎలా కదలాలో నిర్ణయిస్తుంది. దీంతో వాహనం ముందు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నడుస్తుంది.

భవిష్యత్ ప్రణాళిక

కోర్లియోను కాన్సెప్ట్ రూపంలో ఎక్స్‌పో 2025 ఒసాకాలో ప్రదర్శించారు. ఇప్పుడు దీన్ని ఉత్పత్తి దిశగా తీసుకెళ్లేందుకు కవాసకి ప్రత్యేక సేఫ్ అడ్వెంచర్ బృందాన్ని ఏర్పాటు చేసింది. 2035 వరకు ఈ రోబోటిక్ గుర్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వినూత్న శైలిని ఇష్టపడే సాహసికులకు ఈ వాహనం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. కవాసకి సంస్థ తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన అడుగు ఆటోమొబైల్ రంగంలో కొత్త దిశను నిర్దేశించనుంది.