Reading Time: 2 minutes

ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఉంటేనే శాలరీలు! రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే యోచనలో సర్కార్

Caption of Image.
  •  ప్రజలకు ఆఫీసర్లు అందుబాటులో ఉంచడమే లక్ష్యం
  •  ఇప్పటికే సెక్రటేరియెట్, పలు హెచ్‌‌‌‌వోడీల్లో ఫేషియల్ రికగ్నేషన్ అమలు

ప్రజలకు ఉద్యోగులు, అధికారులను అందుబాటులో ఉంచడం, పనితీరులో పారదర్శకతను పెంచేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్​ అటెండెన్స్ సిస్టమ్ ఆధారంగానే ఇకపై శాలరీలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే సెక్రటేరియెట్‌‌లో ఈ విధానం అమలవుతున్నది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పనితీరులో పారదర్శకతను పెంచడంతోపాటు పరిపాలనా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు పనిచేసే ప్రతి ఉద్యోగికి ‘ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టమ్’ (ఎఫ్ఆర్ఏఎస్) ఆధారంగానే ఇకపై నెలవారీ వేతనాలు చెల్లించే సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ ముఖ ఆధారిత హాజరు నమోదైతేనే ట్రెజరీ నుంచి వేతన బిల్లులు ఆటోమేటిక్‌‌‌‌గా పాస్ అయ్యేలా సాంకేతిక అనుసంధాన ప్రక్రియను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కార్యాలయాలకు సకాలంలో రాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే అలవాటుకు కళ్లెం వేసి, ‘సమయపాలన పాటిస్తేనే జీతం’ అనే కఠిన నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర సచివాలయంతోపాటు రాజధాని పరిధిలోని ప్రధాన విభాగాధిపతుల (హెచ్‌‌‌‌వోడీ) కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నేషన్ హాజరు విధానం అమలవుతుండటంతో.. దీనిని జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్ది, మరింత అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో కూడిన యాప్‌‌‌‌లు, ప్రత్యేక పరికరాల ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలనూ ఈ పరిధిలోకి తేనున్నారు. క

లెక్టరేట్లు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహసీల్దార్ ఆఫీసులు, మండల పరిషత్‌‌‌‌లు, మున్సిపాలిటీలు, పీహెచ్‌‌‌‌సీలు, గ్రామ పంచాయతీల వరకు అన్ని అంచెల సిబ్బందిని ఈ సిస్టమ్‌‌‌‌తో అనుసంధానించనున్నారు. ఆర్థిక శాఖకు చెందిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్‌‌‌‌ఎంఐఎస్)తో ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరు డేటాను నేరుగా లింక్ చేసే దానిపై కసరత్తు జరుగుతోంది.

ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి..

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు చెబుతున్నాయి. పల్లెలు, పట్టణాల నుంచి వివిధ ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాలు, భూ సమస్యలు, ఇతర అత్యవసరాల కోసం వచ్చే పౌరులకు చాలాచోట్ల అధికారులు కుర్చీల్లో కనిపించకపోవడం, ‘సారు టూర్‌‌‌‌లో ఉన్నారు’, ‘మీటింగ్​కు వెళ్లారు’ అనే సమాధానాలే ఎదురువుతున్నాయి.

వాస్తవానికి అలాంటిదేమీ లేకున్నా తరచూ ఇదే సమాధానాలు పౌరుల నుంచి వస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదించింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుస్థితికి చెక్ పెట్టి, నిర్ణీత వేళల్లో అధికారులు కార్యాలయాల్లో ఉండేలా ముఖ ఆధారిత హాజరును వేతనాలతో 
ముడిపెడుతున్నారు.

లొసుగులకు తావులేకుండా..

నూతన విధానంలో ఎలాంటి లొసుగులకు తావులేకుండా జియో-ఫెన్సింగ్ (నిర్దేశిత లొకేషన్ పరిధి) సాంకేతికతను తప్పనిసరి చేస్తున్నారు. ఉద్యోగులు తమ కార్యాలయంలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే మొబైల్ లేదా నిర్దేశిత ట్యాబ్‌‌‌‌లలో ముఖాన్ని స్కాన్ చేసి ఇన్-టైమ్, ఔట్-టైమ్ నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చే వారిని ఆలస్యంగా వచ్చినట్లుగా సిస్టమ్ ఆటోమేటిక్‌‌‌‌గా పరిగణిస్తుంది.

నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే ఆ రోజు వేతనంలో కోత విధించేలా ఆటోమేటెడ్ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను రూపొందిస్తున్నారు. అత్యవసర అధికారిక పర్యటనలు, కోర్టు డ్యూటీల వంటి ప్రత్యేక సందర్భాల్లో సంబంధిత ఉన్నతాధికారుల ఆన్‌‌‌‌లైన్ అనుమతి ఉంటేనే మినహాయింపు లభిస్తుంది. సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే వీలు లేకుండా ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించి, ఈ విధానాన్ని నిరంతరం పర్యవేక్షించేలా పకడ్బందీ మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.