Reading Time: < 1 minute
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ.. విషాదాంతం! ఏం జరిగిందంటే..

ప్రేమ, నమ్మకం.. చివరకు కన్నవారినే దూరం చేసిన ఓ యువతి జీవితం విషాదాంతమైంది. ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు సూది మందు ద్వారా విషమిచ్చి హత్య చేసిన నర్సు సురేఖ.. అదే సూది మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ నర్సుగా పనిచేసేది. గతంలో తన తల్లిదండ్రులకు విషం కలిపిన సూది మందు ఇచ్చి హత్య చేసిన కేసులో ఆమె జైలుకు వెళ్లింది. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సురేఖ.. అప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది.

అయితే, తాజాగా హాస్టల్‌లో సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన అదే విధానంలో ఆమె తన జీవితాన్ని కూడా ముగించుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

సురేఖ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సంగారెడ్డి పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటి? జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తల్లిదండ్రుల హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి.. ఇటీవలే బయటకు వచ్చిన సురేఖ ఇలా తన జీవితాన్ని కూడా అర్ధంతరంగా ముగించుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సురేఖ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..