
కొలంబో: శ్రీలంకతో ఆదివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో ఇండియా ఆధిపత్యమే కొనసాగుతోంది. యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (193 బాల్స్‌లో 12 ఫోర్లతో 117) వరుసగా రెండో సెంచరీ చేయడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 300/5 స్కోరు చేసింది. ధ్రువ్ జురెల్ (7 బ్యాటింగ్), సారాన్ష్ జైన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45), కేఎల్ రాహుల్ (18) మెరుగైన ఆరంభాన్నిచ్చారు.
గతంలో కట్ షాట్స్‌తో తరచుగా ఔటైన జైస్వాల్ ఈసారి వాటికి దూరంగా ఉన్నాడు. పేసర్ లాహిరు కుమార (1/38) బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన జైస్వాల్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌నూ సూపర్ కవర్ డ్రైవ్‌తో అలరించాడు. ఎప్పటిలాగే సంయమనంతో ఆడిన రాహుల్.. జయసూర్య బౌలింగ్‌లో బౌలర్ తల మీదుగా అద్భుతమైన సిక్సర్ బాదాడు. కానీ 11వ ఓవర్‌లో కుమార బౌలింగ్‌లో స్క్వేర్ కట్ ఆడబోయి కీపర్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చాడు.
తొలి వికెట్‌కు 37 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్ 0, 1 రన్ వద్ద క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పటిష్టమైన డిఫెన్స్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే రెండో ఎండ్‌లో 17వ ఓవర్‌లో అసితా ఫెర్నాండో (3/46) వేసిన స్వింగ్ బాల్‌కు జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో వికెట్‌కు 31 రన్స్ జతయ్యాయి. 66/2 స్కోరు వద్ద వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50) నిలకడగా ఆడటంతో ఇండియా 88/2 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
కీలక భాగస్వామ్యం.. పంత్‌కు గాయం
రెండో సెషన్‌లో పడిక్కల్, గిల్ లంక బౌలర్లకు కఠిన పరీక్ష పెట్టారు. పేస్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని మూడో వికెట్‌కు 120 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కుమార బౌలింగ్‌లో పడిక్కల్ బలమైన ఫుల్‌షాట్‌తో 90 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అవతలి వైపు గిల్.. జయసూర్య బౌలింగ్‌లో షార్ట్ ఆర్మ్ ఫుల్ బౌండ్రీలతో జోరు పెంచాడు.
వికెట్ల మధ్య మంచి సమన్వయంతో పరుగెత్తిన ఈ ఇద్దరు దాదాపు 26.4 ఓవర్ల పాటు లంక బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే టీ బ్రేక్‌కు ముందు ఏకాగ్రత కోల్పోయిన గిల్.. అసితా ఫెర్నాండో బౌలింగ్‌లో కీపర్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఇండియా 187/3 స్కోరుతో విరామానికి వెళ్లింది. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత రిషబ్ పంత్ (3) రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు.
కుమార వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను స్క్వేర్ వైపు ఫుల్‌షాట్ ఆడబోయిన పంత్ లైన్ మిస్సయ్యాడు. దాంతో వేగంగా దూసుకొచ్చిన బాల్ పంత్ ఎడమ చేతికి బలంగా తాకింది. నొప్పితో ఇబ్బందిపడిన పంత్ చేతికి ఐస్ ప్యాక్‌తో బ్యాండేజ్ వేసినా ఫలితం లేకపోయింది. నొప్పి తీవ్రత పెరగడంతో ఫిజియో సాయంతో పంత్ గ్రౌండ్‌ను వీడాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (43) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పడిక్కల్‌తో కలిసి సింగిల్స్, డబుల్స్ తీస్తూ రన్‌రేట్‌ను మెరుగుపర్చాడు.
ఈ క్రమంలో పడిక్కల్ 168 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. బాగా కుదురుకున్న టైమ్‌లో నువాంత కేశార (1/93) వేగంగా వేసిన ఫ్లాట్ బాల్ అనూహ్యంగా టర్న్ అయ్యి లోపలికి వచ్చింది. ఫుల్ లెంగ్త్‌లో ఉన్న బాల్‌ను ఆడటానికి పడిక్కల్ వెనక్కి రావడంతో బ్యాట్ అంచును తాకుతూ ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. దాంతో నాలుగో వికెట్‌కు 74 రన్స్ ముగియడంతో ఇండియా స్కోరు 281/4గా మారింది. కొత్త బంతిని తీసుకున్న తర్వాత నాలుగు ఓవర్లు ఆడిన జడేజా డే చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. స్కోరు 296/5 అయ్యింది. జురెల్, జైన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
జైస్వాల్‌పై కొరడా..!
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రవర్తన వివాదాస్పదమైంది. లంక పేసర్ అసితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఔటైన జైస్వాల్ పెవిలియన్‌కు వెళ్తున్న టైమ్‌లో ఫెర్నాండో రెచ్చగొడుతూ సెండాఫ్ ఇచ్చాడు. దీనికి ప్రతిస్పందించిన జైస్వాల్ వెనక్కి వచ్చి అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరిన క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో నుదుటికి తాకింది.
దాంతో ఒక్కసారిగా గొడవ తీవ్ర రూపం దాల్చడంతో జోక్యం చేసుకున్న లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వ ఇద్దర్ని వేరు చేసి పరిస్థితిని సద్దుమణిగేలా చేశాడు. అయితే ప్రత్యర్థి జట్టు ప్లేయర్‌కు హెల్మెట్ తాకడమనేది ఐసీసీ లెవెల్–1 నేరం కిందకు వస్తుంది. దీనిపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే అధికారిక హెచ్చరికతో పాటు మ్యాచ్ ఫీజులో కోత, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించే చాన్స్ ఉంది.
సంక్షిప్త స్కోరు: ఇండియా తొలి ఇన్నింగ్స్: 85 ఓవర్లలో 300/5 (పడిక్కల్ 117, గిల్ 50, జైస్వాల్ 45, అసితా ఫెర్నాండో 3/46).