
- తోడి కోడలు కొడుకునే మామప్రేమగా చూస్తున్నాడని ఘాతుకం
- మేడిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
మేడిపల్లి, వెలుగు: మామ ఆదరణ తన బిడ్డ కంటే తోడి కోడలు బిడ్డకే ఎక్కువగా ఉందన్న అక్కసుతో, నాలుగేండ్ల పసివాడిపై ఓ చిన్నమ్మ పగ పెంచుకుంది. ఆ బాలుడిని అంతమొందించాలని పథకం వేసింది. జ్యూస్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించింది. ఈ అమానుష ఘటన మేడిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోడుప్పల్ శ్రీనివాస కాలనీకి చెందిన పర్వతం నాగరాజు, సంధ్య దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు కార్తీక్ వాసు (4) స్థానికంగా ప్లే స్కూల్‌కు వెళ్తున్నాడు. వీరు నాగరాజు తల్లిదండ్రులు సతీశ్ కుమార్, అంజమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు.
అదే ఇంట్లో నాగరాజు సోదరుడు జగదీష్, ఆయన భార్య మంజుల కూడా ఉంటున్నారు. అయితే, తన కొడుకు కంటే కార్తీక్ వాసుపైనే మామ సతీశ్ ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారంటూ మంజుల తరుచూ గొడవలకు దిగేది. ఈ క్రమంలో ఆ బాలుడిపై ద్వేషాన్ని పెంచుకొని, పలుమార్లు హత్యాయత్నం చేసింది. ఒకసారి బెడ్రూమ్లో బాలుడి ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేయబోగా, తల్లి చూసి అడ్డుకుంది. మరోసారి భవనంపైకి తీసుకెళ్లి ప్రమాదకరంగా రేలింగ్‌పై కూర్చోబెట్టగా మామ గమనించి మందలించారు.
జ్యూస్ అని యాసిడ్ తాగించి..
ఈ నెల 9న రాత్రి 10 గంటల సమయంలో కార్తీక్ వాసు హాల్‌లో ఆడుకుంటుండగా, మంజుల అతడిని గదిలోకి పిలిచింది. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి, వంటిట్లోకి తీసుకెళ్లి జ్యూస్ అని నమ్మించి యాసిడ్ తాగించింది. అది తాగిన వెంటనే ఆ బాలుడు విలవిలలాడుతూ కేకలు వేయడంతో తల్లి సంధ్య పరుగున వచ్చింది. తొలుత నిందితురాలు బుకాయించినప్పటికీ, చిన్నారి కార్తీక్ జరిగిన విషయాన్ని చెప్పడంతో అసలు విషయం బయటపడింది.
వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. మూడ్రోజుల చికిత్స అనంతరం బాలుడు కోలుకోవడంతో మంగళవారం రాత్రి వాసు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.