Reading Time: 2 minutes
Campbell Thomson 8 Wickets Bangladesh 54 All Out

Campbell Thomson: క్రికెట్ ప్రపంచంలోకి ఒకే ఒక్క స్పెల్‌తో తుఫానులా దూసుకొచ్చాడు ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల యువ సంచలనం క్యాంప్‌బెల్ థామ్సన్. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన ధాటి ఏంటో నిరూపించుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లకు కలలో కూడా భయం పుట్టించేలా బౌలింగ్ చేశాడు. టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన అంతర్జాతీయ స్థాయి జట్టు బంగ్లాదేశ్‌ను తన పదునైన బౌలింగ్ నైపుణ్యంతో ఒక్కడిగానే కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌తో సరిపెట్టుకున్న థామ్సన్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తి భిన్నమైన రూపం ఎత్తాడు. మైదానంలో నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకలావికలం చేశాడు. పకడ్బందీ లెంగ్త్, వేగంతో బంగ్లా బ్యాటర్లను వరుసగా పెవిలియన్ దారి పట్టించాడు. ఈ యువ బౌలర్ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మెహెదీ హసన్ మిరాజ్ సహా బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. కేవలం 54 పరుగులకే బంగ్లాదేశ్ ఆల్‌అవుట్ కాగా, అందులో ఏకంగా 8 వికెట్లను క్యాంప్‌బెల్ థామ్సన్ ఒక్కడే తన ఖాతాలో వేసుకోవడం అతని ఆధిపత్యానికి నిదర్శనం. ఆ జట్టులోని 10 మంది బ్యాటర్లు ఒంటిసంఖ్యకే పరిమితమవ్వడానికి థామ్సన్ చూపించిన బౌలింగ్ మేజిక్కే కారణం. అంతర్జాతీయ అనుభవం ఉన్న జట్టును తన పేస్ ధాటితో ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించిన థామ్సన్, ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యంత ఆసక్తికరమైన కొత్త సంచలనంగా మారాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మెహెదీ హసన్ మిరాజ్ అద్భుత శతకంతో జట్టును ఆదుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ 355 పరుగులు చేసి, ఏకంగా 92 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆసీస్ యువ బ్యాటర్ టీగ్ విల్లీ 130 పరుగులతో విరుచుకుపడగా, జేక్ డోరన్ 76 పరుగులతో సత్తా చాటాడు. అయితే అసలు డ్రామా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనే మొదలైంది. రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లకు ఆసీస్ 22 ఏళ్ల యువ బౌలర్ క్యాంప్‌బెల్ థామ్సన్ చుక్కలు చూపించాడు. అతని దాటికి బంగ్లాదేశ్ టీమ్ కేవలం 54 పరుగులకే కుప్పకూలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసిన థామ్సన్, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 వికెట్లు నేలకూల్చి బంగ్లా వెన్ను విరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మెహెదీ హసన్ మిరాజ్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయాడు. మొత్తం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 10 మంది బ్యాటర్లు ఒంటిసంఖ్య (సింగిల్ డిజిట్) స్కోరుకే పరిమితం కాగా, కేవలం ఓపెనర్ తాంజిద్ హసన్ మాత్రమే 22 పరుగులతో రెండంకెల స్కోరును దాటగలిగాడు. అతడు మినహా మిగిలిన వారిలో ఎవరూ 6 పరుగుల కంటే ఎక్కువ చేయలేకపోయారు. అంతేకాదు, ముగ్గురు బ్యాటర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఘోర విజయాన్ని నమోదు చేసింది. ఈ దారుణ ప్రదర్శనతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.