
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన పలు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. నల్లమల ప్రాంతంలో రూపుదిద్దుకుంటున్న నన్నారీ గిరిజన ఉత్పత్తులతో పాటు పాడేరు, రంపచోడవరం, అరకు, చింతపల్లి, పార్వతీపురం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు స్వహస్తాలతో తయారు చేసిన విశిష్ట వస్తువులను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో రూపుదిద్దుకునే ఈ ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించి, విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పీ4 (P4) విధానంతో పాటు ‘సూపర్ సిక్స్’ పథకాలు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల నాణ్యతను నిరంతరం అంచనా వేసేందుకు నేరుగా ప్రజల నుంచే అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
‘అనే నేను’ అనే బలమైన ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకున్నప్పుడే వ్యక్తులుగా, కుటుంబాలుగా, సమాజంగా , దేశంగా ప్రగతి సాధించగలమన్నారు. సీఎం హోదాలో తాను ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి, వారి జీవన ప్రమాణాలను పెంచినప్పుడే తన లక్ష్యం నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. ‘నా దేశం, నా ప్రాంత అభివృద్ధిలో నేను ఎలా భాగస్వామిని కాగలను?’ అని ప్రతి పౌరుడూ ఆలోచించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థుల్లో బాధ్యత పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాన్ని కాపాడేలా ‘గ్రీన్ పాస్‌పోర్ట్’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని తెలిపారు. రాబోయే 80వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 21 ఏళ్లలో మన దేశం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యున్నత అభివృద్ధికి చిరునామాగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.