
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలలో రెండుసార్లు శంకుస్థాపనలు!
- వనపర్తి జిల్లాలో నత్తనడకన సాగుతున్న ఫ్యాక్టరీ పనులు
- బై బ్యాక్ సౌకర్యం లేక రవాణా భారంతో రైతుల నష్టాలు
- లక్ష్యానికి ఆమడ దూరంలో పామాయిల్ సాగు
- ఇప్పుడిప్పుడే పునాదుల తవ్వకం
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో పామ్ ఆయిల్ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ, స్థానికంగా బై బ్యాక్ సౌకర్యం లేకపోవడంతో పండించిన గెలలను ఇతర ప్రాంతాల ఫ్యాక్టరీలకు తరలించాల్సి వస్తోంది. ప్రతి జిల్లాలో ఒక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, జిల్లా కేంద్రానికి సమీపంలోని కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద ప్రియూనిక్ కంపెనీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు.
అయితే, రాజకీయ కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీకి రెండుసార్లు శంకుస్థాపనలు జరగడం గమనార్హం. 2023 సెప్టెంబరు 29న బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఒకసారి శంకుస్థాపన చేయగా, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2025 ఫిబ్రవరి 23న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండోసారి భూమిపూజ చేశారు.
ఇంకా పునాదుల తవ్వకం దశలోనే..
ప్రభుత్వాలు మారుతున్నా, శంకుస్థాపనలు జరుగుతున్నా పనులు మాత్రం ఇప్పుడు పునాదుల తవ్వకం దశలోనే కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్‌కు ఎనిమిది నెలల గడువు విధించడంతో నెల రోజుల కింద నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని నిర్మాణ ఇంజినీరు తెలిపారు. తొలి శంకుస్థాపన జరిగి చాలా కాలం వృథా అయినప్పటికీ, ఇప్పటికైనా పనులు వేగవంతం చేసి ఏడాది కాలంలోగా ఫ్యాక్టరీని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తేనే స్థానిక రైతులకు రవాణా ఖర్చులు తగ్గి, మార్కెట్ ధరతో కూడిన అసలైన లాభాలు దక్కుతాయి.
లక్ష్యం చేరని పామాయిల్ సాగు
హార్టికల్చర్ వర్గాల అంచనా ప్రకారం.. జిల్లాలో మొత్తం 15,438 ఎకరాల్లో పామాయిల్ తోటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కేవలం 5,522 ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రతీ మండలానికి ఒక అధికారి చొప్పున, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లతో కలిపి రైతులకు అవగాహన కల్పించాలని, ఒక్కొక్కరు 50 ఎకరాల చొప్పున సాగు చేయించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారం నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం వనపర్తి, శ్రీరంగాపూరు, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో మాత్రమే ఈ పంట ఎక్కువగా సాగవుతోంది.
ఫ్యాక్టరీ పూర్తయితే సాగు పెరిగే అవకాశం
ఈ పంట ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఒకసారి పామాయిల్ తోట వేస్తే రైతులు దాదాపు 30 ఏండ్ల పాటు స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రభుత్వం కూడా దీనికి భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. మొదటి సంవత్సరం ఎకరాకు రూ. 38 వేలు సబ్సిడీ ఇస్తుండగా, రెండో సంవత్సరం నుంచి పంట చేతికి వచ్చే నాలుగో సంవత్సరం వరకు అంతర పంటల సాగు కోసం ఏటా రూ. 4,200 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను పామాయిల్ గెలల ధర రూ. 20,437 వరకు పలుకుతుండటంతో రైతులు ఇప్పుడిప్పుడే ఈ తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. స్థానిక ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేస్తే సాగు మరింత పెరిగే అవకాశం ఉంది.