
సాధారణంగా రోబోలు ఫ్యాక్టరీల్లో పనులు చేస్తాయి. అలాగే హోటళ్లలో ఫుడ్ సర్వ్ చేస్తూ, ఇళ్లను క్లీన్ చేస్తూ కనిపిస్తుంటాయి. ఇవన్నీ మనం ఇప్పటివరకు విన్నవి, చూసినవి. కానీ టెక్నాలజీలో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండే చైనాలో ఇప్పుడు ఒక ఊహించని విచిత్రమైన సీన్ వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చుని, దారిపోయే వారిని చేతులు జోడించి మరీ ఒక హ్యూమనాయిడ్ రోబో అడుక్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విచిత్రమైన దృశ్యాన్ని చూసి నెటిజన్లు షాక్ అవ్వడమే కాదు, బాబోయ్.. వీటికి కూడా కష్టాలు వచ్చాయా అని కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ ఉద్యోగాలూ సేఫ్ కాదు కాబోలు.. రోబోలు కూడా అడుక్కోవడానికి రోడ్లపైకి వచ్చేసాయి అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
సదరు రోబో కేవలం చేతులు ఊపుతూ సైగలు చేయడమే కాదు.. ఏకంగా క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్ల ద్వారా డిజిటల్ విరాళాలు అడిగేలా ప్రోగ్రామ్ చేసినట్లు తెలుస్తోంది. అంటే చిల్లర లేదనే సాకు కూడా ఇక్కడ నడవదన్నమాట. అయితే ఈ వీడియో వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఇది ఏదైనా ఆర్ట్ ప్రాజెక్టా, కంపెనీ మార్కెటింగ్ స్టంటా లేదా సమాజంపై చేస్తున్న ఒక వినూత్న సోషల్ ఎక్స్‌పెరిమెంటా అనేది ఇంకా తెలియలేదు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ‘యాచన’ను ఒక అత్యాధునిక రోబో చేస్తుండటం అందరినీ ఆలోచనలో పడేస్తోంది.
Poor beggar, he is begging for the cost of charging.😅😅
Buy a robot to make money. pic.twitter.com/7jBKZJG12b— Sharing Travel (@TripInChina) June 13, 2026
ప్రస్తుతం చైనాలో హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ‘యూనిట్రీ’ వంటి అనేక చైనీస్ రోబోటిక్స్ కంపెనీలు పాశ్చాత్య దేశాల కంటే తక్కువ ధరలకే అద్భుతమైన సామర్థ్యం గల రోబోలను తయారు చేస్తూ అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ డ్యాన్స్ చేయడం, మార్షల్ ఆర్ట్స్ చేయడం, మాల్స్ లో కస్టమర్లకు సేవలు అందించడం వంటి పనులను రోబోలు విజయవంతంగా చేస్తున్నాయి.
ALSO READ : ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన బ్లాక్ బ్యూటీ..
అయితే ల్యాబొరేటరీలు, ఫ్యాక్టరీలు లాంటి వాతావరణం దాటి ఇవి మనుషుల నిజ జీవిత సాధారణ వీధుల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. కారణం ఏదైనా కావచ్చు.. ఇలా ఒక హ్యూమనాయిడ్ రోబో మోకాళ్లపై కూర్చున్న వీడియో మాత్రం ఒకటి నిజం చేసింది. భవిష్యత్తులో మన నగరాల వీధుల్లో ఇలాంటి రోబోలను సాధారణంగా చూసే ఒక వింత ప్రపంచాన్ని ఊహించుకునేలా చేసేసింది.