
Watch : ముంబైలోని ప్రసిద్ధ వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. జూన్ 13న డిఫెండింగ్ ఛాంపియన్ మరాఠా రాయల్స్, ఏఆర్సీఎస్ అంధేరి జట్ల మధ్య జరిగిన ఈ టైటిల్ పోరులో కేవలం క్రికెట్ సమరమే కాకుండా, ఆటగాళ్ల మధ్య తీవ్రమైన ఆగ్రహావేశాలు కూడా బయటపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ గెలవాలనే తీవ్రమైన ఒత్తిడి కారణంగా లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోనే ఒకరినొకరు నెట్టుకుంటూ గొడవకు దిగడం సంచలనంగా మారింది.
ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ఏఆర్సీఎస్ అంధేరి జట్టు విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఉత్కంఠ సమయాల్లో మరాఠా రాయల్స్ బౌలర్ రోహన్ రాజే అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీనితో మరాఠా రాయల్స్ జట్టు 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజయం ఖరారైన వెంటనే బౌలర్ రోహన్ రాజే భావోద్వేగాన్ని ఆపుకోలేక, లార్డ్స్ స్టేడియంలో సౌరవ్ గంగూలీ చేసినట్లుగా తన జెర్సీని విప్పేసి గాల్లోకి ఊపుకుంటూ మైదానమంతా పరుగెత్తాడు. అతనితో పాటు మిగిలిన టీమ్ సభ్యులు కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఏఆర్సీఎస్ అంధేరి జట్టు తరఫున బరిలోకి దిగాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మరాఠా రాయల్స్ జట్టును కట్టడి చేయడంలో అర్జున్ కీలక పాత్ర పోషించాడు. అతను తన 4 ఓవర్ల కోటాలో 36 రన్స్ ఇచ్చి 2 ముఖ్యమైన వికెట్లను పడగొట్టాడు. మరాఠా రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టులో చిన్మయ్ రాజేష్ సుతార్ 52 బంతుల్లో 61 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా స్కోరు చేయలేకపోయాడు.
Big fight in t20 Mumbai final!!
– Shivam Dube to rescue.
pic.twitter.com/niaNJntnpM
— Cricket Central (@CricketCentrl) June 14, 2026
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏఆర్సీఎస్ అంధేరి జట్టు చివరి బంతి వరకు పోరాడినా 146 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 18వ ఓవర్లో ఒక పెద్ద గొడవ జరిగింది. కేవలం 4 బంతుల వ్యవధిలోనే అంధేరి జట్టు 2 పెద్ద వికెట్లను కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో స్టార్ ప్లేయర్ శివమ్ దూబే అవుట్ కాగా, ఆ వెంటనే ఇర్ఫాన్ ఉమైర్ బౌలింగ్‌లో గౌరవ్ జాతర్ అవుట్ అయ్యాడు. గౌరవ్ జాతర్ పెవిలియన్ వైపు వెళ్తున్న సమయంలో మరాఠా రాయల్స్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే ఏదో అనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
గౌరవ్ జాతర్, తుషార్ దేశ్‌పాండే మధ్య మాటలు ముదిరి ఒకరినొకరు చేతులతో నెట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. వాంఖెడే స్టేడియంలో ఉన్న అంపైర్లు, మిగిలిన ఆటగాళ్లు వారిని వారించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి మరింత చేజారిపోతోందని గమనించిన ఏఆర్సీఎస్ అంధేరి జట్టు కెప్టెన్ శివమ్ దూబే వెంటనే డగౌట్ నుంచి మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. గొడవ పడుతున్న గౌరవ్ జాతర్‌ను పక్కకు లాగి, అతనికి నచ్చజెప్పి పెవిలియన్‌కు పంపించడంతో మైదానంలో వాతావరణం శాంతించింది. ఈ ఓటమితో అంధేరి జట్టు రన్నరప్‌గా నిలవగా, మరాఠా రాయల్స్ బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీలతో లీగ్‌లో రికార్డు సృష్టించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి