
ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వృద్ధి తగ్గుతుందనే భయాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ నిరంతరం పడిపోతుండటం వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుండి వెనక్కి తగ్గుతున్నారు. ఈ నెల జూన్ మొదటి రెండు వారాల్లోనే వారు రూ.62 వేల 853 కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేశారు.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) లెక్కల ప్రకారం 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు (FPIలు) భారత మార్కెట్ నుండి మొత్తం రూ.2 లక్షల 87 వేల కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇది గత ఏడాది 2025లో మొత్తం తీసుకున్న రూ.1 లక్ష 66 వేల కోట్ల కంటే చాలా ఎక్కువ.
ప్రతినెల పెట్టుబడుల వివరాలు చూస్తే జనవరిలో 35 వేల 962 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఫిబ్రవరిలో 22 వేల 615 కోట్లు కొత్తగా పెట్టుబడి పెట్టారు. ఇది గత 17 నెలల్లోనే చాలా ఎక్కువ. ఇక మార్చిలో రూ.1 లక్ష 17 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఇది ఒక రికార్డు స్థాయి అమ్మకం. ఏప్రిల్ లో చూస్తే రూ.60 వేల 847 కోట్ల విలువైన షేర్లను… మేలో రూ.32 వేల 963 కోట్ల షేర్లను అమ్మేశారు. ప్రస్తుతం జూన్ మొదటి 2 వారాల్లో 62 వేల 853 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.
పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి కారణాలు:
* ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయా లేదా తగ్గిస్తాయా అనే అంచనాలు, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల పరిణామాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
* మార్కెట్‌లో నష్టపోయే భయం ఎక్కువగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశాల కంటే.. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో లేదా బంగారం లాంటి సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.
* మిగతా దేశాల మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో షేర్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా విదేశీయులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతున్నారు.
*అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బాగా పడిపోవడం మరో ముఖ్య కారణం. ఆర్‌బీఐ (RBI) కరెన్సీని కాపాడటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, 2026లో రూపాయి విలువ దాదాపు 6 శాతం, గత ఏడాది కాలంలో 10 శాతం పడిపోయింది. దీనివల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80 నుండి దాదాపు 95కు పడిపోయింది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
గత వారం చివరి రోజుల్లో విదేశీయుల అమ్మకాల వేగం కాస్త తగ్గింది. శుక్రవారం నాడు వారు కేవలం రూ.1,082 కోట్ల షేర్లను మాత్రమే అమ్మారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందనే నమ్మకంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 87 డాలర్ల కంటే కిందికి పడిపోయింది. భారతదేశం ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ధరలు తగ్గడం మన దేశానికి పెద్ద రిలీఫ్.
*డబ్బును ఆకర్షించడానికి ఆర్‌బీఐ (RBI) ఇంకా ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
*వాణిజ్య బ్యాంకులు సేకరించే విదేశీ డిపాజిట్ల (FCNR) భారాన్ని తగ్గించడం.
*విదేశీ మారక ద్రవ్యానికి (ఫారెక్స్) సంబంధించిన సదుపాయాలను పెంచడం.
*ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని సులభతరం చేయడం.
*ప్రవాస భారతీయులు (NRIs), భారత సంతతి వ్యక్తులు (OCIs) దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడి పరిమితులను పెంచడం.
స్టాక్ మార్కెట్ (ఈక్విటీ) నుండి డబ్బులు వెనక్కి తీసుకున్నప్పటికీ… విదేశీ పెట్టుబడిదారులు ప్రభుత్వ బాండ్లు, అప్పు పత్రాలలో (Debt Market) జూన్ మొదటి రెండు వారాల్లో రూ.13,200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. దీనితో ఈ ఏడాది ఇప్పటివరకు బాండ్లలో పెట్టిన మొత్తం పెట్టుబడి దాదాపు రూ.28,000 కోట్లకు చేరింది.