Reading Time: 2 minutes
Tollywood : 500లకు పైగా సినిమాలు.. 40 ఏళ్లు ఇండస్ట్రీలో కామెడీకి రారాజు.. నటుడు నగేశ్ గురించి తెలుసా.. ?

ప్రత్యేకమైన డిక్షన్, డైలాగ్ డెలివరీ, సహజమైన నటనతో నగేష్ భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. హాస్యాన్ని పండించడంలో ఆయన చూపిన నైపుణ్యం అసాధారణం. అందుకే డైలాగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న హాస్యనటుల వరుసలో నగేష్ పేరు ముందుంటుంది. వచ్చిరాని తెలుగులో ఆయన డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు ఎంతో ఆస్వాదించేవారు. తమిళ ప్రేక్షకులకే కాకుండా, తెలుగు వారికి కూడా ఆయన దగ్గరయ్యారు. నగేష్ కేవలం హాస్యానికే పరిమితం కాలేదు. చార్లీ చాప్లిన్ బాటను అనుసరించి, హాస్యంతో పాటు కరుణ రసాన్ని కూడా పండించగల అరుదైన నటులలో ఆయన ఒకరు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పాటు మూడు తరాలు నటించిన ఘనత నగేష్ ది. ఆయన అసలు పేరు గుండూరావు. ఆయన 1933 సెప్టెంబర్ 27న కర్ణాటకలో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తన ప్రతిభ నిరూపించుకునే లక్ష్యంతో మద్రాస్ వచ్చేశారు. వెస్ట్ మాంబళంలోని ఒక చిన్న గదిలో తమిళ రచయిత వాలి, నటుడు శ్రీకాంత్ లతో కలిసి కొంతకాలం ఉన్నారు. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసినప్పటికీ, నాటకాలపై మక్కువతో నటుడిగా మారారు. ఈ క్రమంలో తన పేరును నాగేశ్వరన్ గా మార్చుకున్నారు, చివరికి అది నగేష్ గా స్థిరపడింది.

నగేష్ ప్రదర్శించిన ఒక నాటకానికి అప్పట్లో ఎంజీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. నగేష్ అభినయం ఎంజీఆర్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఫలితంగా, “తామరక్కుళం” చిత్రంలో నగేష్ కు చిన్న వేషం లభించింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా, బ్రేక్ రాలేదు. ఆ సమయంలోనే దర్శకుడు ఒక కొత్త హాస్యనటుడి కోసం వెతుకుతూ, నగేష్ గురించి విని “నెంజిల్ ఆర్ ఆలయం” చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నగేష్, మనోరమ జంటగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి 175 రోజులు ఆడింది. అప్పటి నుంచి ఈ జంట ఎన్నో చిత్రాల్లో నటించి విజయం సాధించింది.

తెలుగు చిత్రసీమలో ప్రస్థానం:
1964లో వచ్చిన “సర్వర్ సుందరం” చిత్రంతో నగేష్ నట జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఈ సినిమాతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుండి అనువాద చిత్రాల ద్వారా, స్ట్రెయిట్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ నటించిన “దేవత” చిత్రంలో సినిమా డైరెక్టర్ గా కనిపించి దాదాపు అరగంట సేపు థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించారు. కష్టపడి పైకి వచ్చిన నగేష్ కు తన స్థానం విలువ ఏమిటో తెలుసు కనుక వృత్తిలో ఎప్పుడూ అలక్ష్యం చూపించలేదు. దర్శకుడు తనకు అప్పగించిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఒకసారి ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆయనతో గొడవ పడటం వల్ల చెన్నైలోని నగేష్ థియేటర్ను సీజ్ చేసే వరకు వ్యవహారం వెళ్ళింది, కానీ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసిపోయారు. రామానాయుడు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన 15 చిత్రాల్లో నగేష్ నటించడమే కాకుండా, ఆయన నిర్మించిన “మొరటోడు” చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. నటుడు కమలహాసన్  ప్రతి చిత్రంలో నగేష్ ఉండేవారు. “విచిత్ర సోదరులు”, “ఇంద్రుడు చంద్రుడు” చిత్రాల్లో నగేష్ తో విలన్ పాత్రలు పోషింప చేసిన ఘనత కమల్‌దే.

నగేష్ లోని బహుముఖ ప్రజ్ఞ చూస్తే తనకు అసూయగా ఉందని కమల్ తరచుగా చెప్పేవారు. ఆ రోజుల్లో నగేష్ లేని తమిళ చిత్రం ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. రోజుకి నాలుగైదు చిత్రాల్లో నటించేవారు, కారు వెనుక సీట్లో విగ్గులు, డ్రెస్సులు పెట్టుకుని మేకప్ మ్యాన్ తో గంటకో స్టూడియో తిరుగుతుండేవారు. నగేష్ జీవితంలో ఎంతో విషాదం ఉంది. తన సంపాదనను ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టి నష్టపోయారు. ఆయన కుమారుడు ఆనంద్ ను నటుడిగా పరిచయం చేసినా ఆయన సక్సెస్ కాలేదు. భారతీయ సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నగేష్, 2009 జనవరి 31న చెన్నైలోని తన ఇంట్లో కన్నుమూశారు.

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..