Reading Time: 2 minutes
Passport Facts: భారతదేశంలో 4 రకాల పాస్‌పోర్ట్‌లు.. ఏ రంగు ఎవరికి ఇస్తారు? ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయి?

Indian Passport Facts: విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్యూలో నిలబడినప్పుడు మీ చుట్టూ ఉన్న వారి పాస్‌పోర్ట్‌లను ఎప్పుడైనా చూశారా? కొన్ని నీలం రంగులో, కొన్ని ఎరుపు, ఆరెంజ్‌ రంగులో, కొన్ని ఆకుపచ్చ రంగులో, కొన్ని నలుపు రంగులో ఉంటాయి. ఇన్ని రకాల రంగులు ఎందుకు ఉన్నాయి? దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ చట్టం ఉందా? లేక దేశాలు వాటంతట అవే నిర్ణయించుకుంటాయా?

సమాధానం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌లకు కేవలం నాలుగు ప్రధాన రంగులు మాత్రమే ఉన్నాయి. బ్లూ, మెరూన్‌, తెలుపు, ఆరేంజ్‌ వంటి రంగులు ఉంటయి. వీటిలో ప్రతిదానికీ లేత నావీ బ్లూ నుండి దాదాపు నలుపు రంగు ముదురు నీలం వరకు విభిన్న ఛాయలు ఉంటాయి. కానీ ప్రాథమిక రంగులు మాత్రం ఒకేలా ఉంటాయి.

రంగు గురించి అంతర్జాతీయ చట్టం ఏదీ లేదు:

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే పాస్‌పోర్ట్ ఏ రంగులో ఉండాలనే దానిపై అంతర్జాతీయ నియమం ఏదీ లేదు. కానీ వ్యక్తులను బట్టి, వారికున్న ప్రాధాన్యత ఆధారంగా ఆ రంగు పాస్ పోర్ట్ ను కేటాయిస్తారు. ఒక్కో రంగు పాస్‌పోర్ట్‌కు ఒక్కో ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంటుంది. ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు సదరు వ్యక్తి హోదా ఏమిటో సులభంగా అర్థం కావడానికి ఈ రంగుల వర్గీకరణ ఉపయోగపడుతుంది. మరి ఆ నాలుగు రంగుల పాస్‌పోర్ట్‌లు ఏవి? అవి ఎవరెవరికి ఇస్తారు? వాటి వల్ల వచ్చే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఎవ్వరికి తెలియని విషయాలు!

  1. బ్లూ పాస్‌పోర్ట్ (సాధారణ పౌరులకు)భారతదేశంలో అత్యధికులు కలిగి ఉండేది ఈ బ్లూ కలర్ (సాధారణ) పాస్‌పోర్ట్. దీనిని సాంకేతికంగా ‘టైప్ పి’ (Type P – Personal) పాస్‌పోర్ట్ అని పిలుస్తారు. దేశంలోని సాధారణ పౌరులు అందరికీ దీనిని జారీ చేస్తారు. ఎవరైనా వ్యక్తిగత పనులు, విహారయాత్రలు, ఉన్నత చదువులు లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఈ పాస్‌పోర్ట్ ఇస్తారు. దీని ప్రత్యేకత విషయానికొస్తే.. ఈ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు విదేశాలకు వెళ్లేటప్పుడు సాధారణ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను, వీసా ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  2. వైట్ పాస్‌పోర్ట్ (ప్రభుత్వ అధికారులకు)తెలుపు రంగులో ఉండే ఈ పాస్‌పోర్ట్‌ను ‘టైప్ ఎస్’ (Type S – Service) పాస్‌పోర్ట్ అని అంటారు. భారత ప్రభుత్వం తరఫున అధికారిక పనుల మీద విదేశాలకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులకు దీనిని ఇస్తారు. వ్యక్తిగత పర్యటనలకు కాకుండా, కేవలం ప్రభుత్వ విధుల నిర్వహణ కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించాలి. ఎయిర్‌పోర్టుల్లో వీరికి ఇమ్మిగ్రేషన్ తనిఖీలు చాలా వేగంగా పూర్తవుతాయి. వీరికి ప్రత్యేక ప్రోటోకాల్‌, గౌరవం లభిస్తుంది.
  3. మెరూన్ పాస్‌పోర్ట్ (దౌత్యవేత్తలకు – VIP) ముదురు ఎరుపు లేదా మెరూన్ రంగులో ఉండే ఈ పాస్‌పోర్ట్‌ను ‘టైప్ డి’ పాస్‌పోర్ట్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్. భారతీయ దౌత్యవేత్తలు, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు (MPs), సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వంటి వీఐపీలకు దీనిని జారీ చేస్తారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వెళ్లేటప్పుడు దీనిని జారీ చేస్తారు. ఈ పాస్‌పోర్ట్ ఉన్నవారికి అనేక దేశాలకు వెళ్లడానికి ముందస్తు వీసా (Visa) అవసరం ఉండదు. వీరికి అంతర్జాతీయంగా దౌత్యపరమైన మినహాయింపులు, ఎయిర్‌పోర్టుల్లో విమాన శ్రేణి విఐపి సదుపాయాలు లభిస్తాయి.
  4. ఆరెంజ్ పాస్‌పోర్ట్ (వలస కార్మికుల రక్షణ కోసం) భారత ప్రభుత్వం 2018 లో ఈ ఆరెంజ్ (నారింజ) రంగు పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుకుని, విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే పౌరులకు దీనిని కేటాయించారు. వీరు ECR (Emigration Check Required) పరిధిలోకి వస్తారు. చదువుకోకుండా విదేశాలకు వెళ్లే అమాయక కార్మికులు అక్కడ మోసపోకుండా చూడటం, వారి భద్రతను పర్యవేక్షించడం ఈ పాస్‌పోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాస్‌పోర్ట్ ఉన్నవారు విదేశాలకు వెళ్లే ముందు ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి ప్రత్యేక అనుమతి (ఎమిగ్రేషన్ క్లియరెన్స్) పొందాల్సి ఉంటుంది.

(గమనిక: ఈ విధానంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఇందులో కొన్ని మార్పులు చేసింది. ఇలా రంగును బట్టే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సదరు ప్రయాణికుడి హోదాను గుర్తించి, వారికి తగిన ఇమ్మిగ్రేషన్ సేవలను అందిస్తారు. తదుపరిసారి మీరు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పుడు వివిధ రంగుల పాస్‌పోర్ట్‌లను గమనించడం మర్చిపోకండి. ఈ సమాచారం ప్రయాణ అవగాహన కొరకు మాత్రమే. మీ అవసరాలకు తగిన పాస్‌పోర్ట్ రకాన్ని అధికారిక పాస్‌పోర్ట్ సేవా కేంద్రం వెబ్‌సైట్ ద్వారా ధృవీకరించుకోవచ్చు.)

ఇది కూడా చదవండి: Elon Musk: మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి