Reading Time: 2 minutes
Rahmanullah Gurbaz Credits Gautam Gambhir For Brilliant Century Against India

Rahmanullah Gurbaz Dedicates His Century to Indian Fans: శనివారం భారత్‌తో ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుత శతకంతో మెరిశాడు. జట్టు ఓడిపోయినప్పటికీ.. అతడి మెరుపు ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంది. కేవలం 51 బంతుల్లో 102 పరుగులు చేసిన గుర్బాజ్.. భారత్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. మ్యాచ్ అనంతరం గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. భారత్‌ను తన రెండో ఇల్లుగా అభివర్ణించిన అతడు.. ఇక్కడ పరుగులు చేయడం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని చెప్పాడు. భారత జట్టు లాంటి బలమైన ప్రత్యర్థిపై సెంచరీ చేయడం తనకు ఎంతో గర్వకారణమని గుర్బాజ్ పేర్కొన్నాడు.

భారత్ నా రెండో ఇల్లు:

‘ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైనది. భారత్ ఎప్పుడూ నా రెండో ఇల్లులా అనిపిస్తుంది. ఇక్కడ పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. భారత్ వంటి గొప్ప జట్టుపై సెంచరీ సాధించడం గర్వకారణం. ఈ శతకాన్ని భారత అభిమానులకు అంకితం చేస్తున్నాను’ అని రహ్మనుల్లా గుర్బాజ్ భావోద్వేగంగా తెలిపాడు. భారత అభిమానులు అఫ్గానిస్థాన్ క్రికెట్‌కు ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేశాడు. ‘భారత అభిమానులు మాపై ఎప్పుడూ ఎంతో ప్రేమ చూపించారు. అఫ్గానిస్థాన్ క్రికెట్ ఎదుగుదలకు వారి మద్దతు ఎంతో విలువైనది. మేము, భారత ప్రజలు మంచి స్నేహితుల్లా ఉంటాం. ఆ బంధం మాకు చాలా ముఖ్యమైనది’ అని చెప్పుకొచ్చాడు.

గంభీర్‌ సర్‌ సూచనలు ఇచ్చాడు:

తన సెంచరీ ఇన్నింగ్స్‌ వెనుక భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ సూచనలు చాలా ప్రభావం చూపించాయని గుర్బాజ్‌ చెప్పాడు. ‘ఈ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ మా జట్టు ఓడిపోయినందుకు నిరాశకు గురయ్యా. వ్యక్తిగతంగా నా ఆట మెరుగైంది. నెట్స్‌లో బాగా శ్రమించా. ఈ ఇన్నింగ్స్‌ క్రెడిట్ గౌతమ్ గంభీర్‌కే దక్కుతుంది.టెస్టు మ్యాచ్‌ తర్వాత గంభీర్‌తో సంభాషించా. అది నాకు బాగా ఉపయోగపడింది. షాట్ల ఎంపికలో ఎలా మెరుగు కావాలని అడిగితే.. మంచి సూచనలు ఇచ్చాడు. నెట్స్‌లో అదే ప్రాక్టీస్‌ చేశా, ఇప్పుడు వచ్చింది. గంభీర్‌ సర్‌కు నా కృతజ్ఞతలు చెబుతున్నా’ అని గుర్బాజ్‌ పేర్కొన్నాడు.

బాధ్యతాయుతంగా ఆడిన గుర్బాజ్:

ధర్మశాల వన్డేలో అఫ్గానిస్థాన్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో గుర్బాజ్ బాధ్యతాయుతంగా ఆడాడు. అదే సమయంలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. హష్మతుల్లా షాహిదీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. జట్టు విజయాన్ని అందుకోలేకపోయినా.. భారత అభిమానులపై గుర్బాజ్ వ్యక్తం చేసిన ప్రేమ, కృతజ్ఞతలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని వ్యాఖ్యలు రెండు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ఉన్న స్నేహపూర్వక బంధానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయి.