
మిర్చీ రైతులకు షాకింగ్ న్యూస్ ఇది. ఇండియాలో పండిస్తున్న ఎండు మిర్చీ దిగుమతులను చైనా బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం ఎగుమతులపై ఆధారపడిన వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటీవలే రైస్ దిగుమతిపై బ్యాన్ విధించిన చైనా.. ఇప్పుడు ఎండు మిర్చీపై నిషేధం విధించడం ఆందోళన కలిగించే అంశం.
ఇండియా నుంచి వస్తున్న మిర్చీలో హానికర రసాయనాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన చైనా.. వాటి దిగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియాలో పండే మిర్చీలో మిథామిడోపాస్ రసాయనాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కెమికల్ అత్యంత విషపూరితమే కాకుండా.. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు చైనా పేర్కొన్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎండుమిర్చి ఎగుమతులకు ఇండియా ఎక్కువగా చైనాపైనే ఆధారపడింది. చైనాకు మిర్చీ సరఫరా చేసే దేశాలలో ఇండియా మూడో స్థానంలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 36 వేల టన్నులు ఎండు మిరపకాయలను చైనాకు ఎగుమతి చేశారు. గత ఏడాదితో పోల్చితే ఇది 31 శాతం అధికం. ఈ ఏడాది 19 శాతం పెరిగి.. 7 లక్షల 15 వేల టన్నులకు మన ఎగుమతులు చేరుకున్నాయి.
చైనా దిగుమతి చేసుకునే మిర్చీని ఎక్కువ శాతం ఓలియోరెజిన్ అనే పదార్థం వెలికి తీసేందుకు వినియోగిస్తున్నారు. నేచురల్ స్పైసీ ఫ్లేవర్ కోసం దీన్ని వినియోగిస్తారు. ఓలియో రెజిన్ కోసం ఎక్కువగా తేజా రకం మిర్చీని వినియోగిస్తారు.
ఇప్పటికే బియ్యంలో కెమికల్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి కొన్ని రకాలను బ్యాన్ చేసిన చైనా లేటెస్టుగా మిర్చీని కూడా బ్యాన్ చేయడం గమనార్హం. పురుగల మందు అవశేషాలు ఎక్కువగా ఉంటున్నందుకు తాత్కాలికంగా బ్యాన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ధర తక్కువగా ఉండటం, అత్యధిక దిగుమతి కారణంగా చైనా ఇండియన్ మార్కెట్ నుంచి మిర్చీ కొనేందుకు ఆసక్తి చూపుతుంటుంది. 2024-25 తర్వాత భారత్ నుంచి దిగుమతి శాతాన్ని పెంచింది కూడాను.
2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాకు ఇండియా నుంచి 3 వేల కంటైనర్లలో మిర్చీ ఎగుమతి జరిగింది. అందులో 10 నుంచి 15 శాతం క్వాలిటీ సమస్యలు వచ్చాయి. తేమ శాతం ఉండటం కొంత అయితే.. పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో వెనక్కు పంపించినట్లు తెలస్తోంది.