
- తామే కాల్చి చంపామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
చండీగఢ్: హర్యానాలోని హన్సి సిటీలో ఘోరం జరిగింది. ఒక జిమ్ యజమానిని బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అతడిపై దాదాపు10 రౌండ్ల కాల్పులు జరిపి మట్టుబెట్టారు. ఈ దారుణానికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
గురువారం తెల్లవారుజామున ఫవ్వారా చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..‘రెడ్ జిమ్’ నిర్వాహకుడైన కపిల్ గురువారం ఉదయం యువతీ, యువకులకు వ్యాయామ శిక్షణ ఇస్తున్నాడు. ఆ సమయంలో హెల్మెట్లు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కపిల్‌పై అతి సమీపం నుంచి 10 రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన కపిల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ కాల్పుల్లో ఒక మహిళ కూడా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేసు తీవ్రతను పరిగణించి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిబ్బందిని, ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు.
హత్య జరిగిన కాసేపటికే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు హరి బాక్సర్ పేరుతో ఉన్న ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కపిల్ హత్యకు తాము పూర్తి బాధ్యత వహిస్తున్నామని అతడు పేర్కొన్నాడు. ఈ ఆడియో క్లిప్ హర్యానా, ఢిల్లీ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.