
94 ఏళ్ల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సినిమా చేస్తున్నాడు అనగానే, అందరూ ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ఎదురుచూశారు. నిజానికి సింగీతం శ్రీనివాసరావుకి ఉన్న ట్రాక్ రికార్డు అలాంటిది. ఎందుకంటే, ఆయన ఎప్పుడో ఫ్యూచర్ ని అంచనా వేసి ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’ లాంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన కథ నచ్చడంతో ఏకంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి నిర్మాతగా మారి సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన రాగానే, ఆ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఎదురుచూశారు. దానికి తోడు, సినిమాలో 90 శాతానికి పైగా డైలాగ్స్ ఉండవని, అంతా పాటలతోనే అని ప్రచారం చేయడంతో అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో అని మరింతగా ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
సింగీతం కథ :
ప్రతాప్ (అయాన్) తన తండ్రి (రాహుల్ రవీంద్రన్) ఆస్తులు వెతుక్కుంటూ కుబేరపురం అనే ఊరికి వెళతాడు. ఆ కుబేరపురం నిజానికి ఒక చెట్టు కూడా లేని ఒక మైనింగ్ ప్రాంతంగా మారిపోయి ఉంటుంది. అయితే, ఆ కుబేర గోల్డ్ మైన్స్ లో తన తండ్రికి వాటా ఉందని తెలుసుకుని, ప్రస్తుతం ఆ మైన్ నడుపుతున్న రేణు (శాలిని)ని కలిసి వాటా పొందే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె దాన్ని ఒక విదేశీయుడికి అమ్మే ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకుని, తాను కూడా ఆ ప్రయత్నంలో భాగమవుతాడు.
కాని, అదే మైన్ లో పనిచేస్తూ ఉండే గౌరి (అహిల్య బమ్రో) కారణంగా ఆ ఊరు మొత్తం ఒక శాపంలో చిక్కుకుంటుంది. ఆ శాపం వలన ఆ ఊరి వారందరి మాటలు, పాటల రూపంలోకి మారిపోతాయి. అయితే ఈ శాపం ఎందుకు వచ్చింది? ఆ శాపం నుండి ఆ ఊరి ప్రజలంతా విమోచనం చేసుకోగలిగారా? తన తండ్రి వాటా కోసం కుబేరపురం వచ్చిన ప్రతాప్ ఆ వాటా పొందగలిగాడా? చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
సింగీతం శ్రీనివాసరావు 40 ఏళ్ల క్రితం కమల్ హాసన్ తో డిస్కస్ చేసిన స్టోరీ లైన్, నాగ్ అశ్విన్ నిర్మాణం, సింగీతం శ్రీనివాసరావు మీద ఉన్న నమ్మకం—ఇవి పూర్తిగా ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఇప్పటివరకు ఉన్న అంచనాలు. కేవలం ఆ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులను పూర్తిగా కుబేరపురం అనే ఒక కల్పిత ప్రాంతానికి తీసుకువెళ్లిపోయారు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.
సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ఎలాంటి సాగతీతలు లేకుండా నేరుగా కథలోకి తీసుకువెళ్లిపోయిన దర్శకుడు, అసలు ఆ ఊరు ఎందుకలా మారింది, ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి అనే విషయాలను చాలా ఆసక్తికరంగా రాసుకున్నారు. నిజానికి ఇది ఏదీ కొత్త కథ కాదు. మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు, లేక తర్వాత కాలంలో వచ్చిన కొన్ని కథలలోనూ చదివిన కథలాగే అనిపిస్తుంది. కానీ దానికి సింగీతం శ్రీనివాసరావు మార్క్ ట్రీట్మెంట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
సినిమా ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా సాగతీతలు లేకుండానే వెంటనే కథలోకి తీసుకువెళ్లిపోయిన దర్శకుడు, ఆ ఊరు, ఆ ఊరి స్థితిగతులు, ఆ ఊరు ఎందుకలా మారాల్సి వచ్చింది అనే విషయాలను ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కూడా చాలా త్వరగా ముగిసిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సరిగ్గా ఇంటర్వెల్ ముందు, సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతోంది అనే విషయం మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేసేలా చేశారు.
ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఎక్కువ సమయం తీసుకోకుండానే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించి, అసలు ఆ ఊరు ఎందుకలా మారింది అనే విషయాన్ని చూపించారు. నిజానికి ఇది ప్రకృతి చుట్టూ రాసుకున్న కథ. మనిషి తన అవసరాల కోసం, అత్యాశకు పోయి ప్రకృతిని ఎంతగా నాశనం చేస్తున్నాడు అనేదాన్ని వ్యంగ్య గర్భంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇలాంటి ఆలోచన 40 ఏళ్ల క్రితమే వచ్చింది అంటే, ఆయన విజనరీ ఆలోచనలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎక్కడా ఏమాత్రం ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఒక స్టార్ హీరో ఎంట్రీ ఒక స్పెషల్ బోనస్ అనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే: ఈ సినిమాలో పేరు మోసిన నటీనటులు చాలా తక్కువే. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్త వారే. విలన్ గా కనిపించిన అమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీళ్లను ప్రధాన పాత్రధారులుగా పెట్టుకుని సినిమా తీయడం ఒక సాహసం అయితే, సినిమాని చాలా వరకు పాటలతోనే నడిపించాలని నిర్ణయం తీసుకోవడం మరో సాహసం. హీరో, హీరోయిన్లు, విలన్ పాత్రధారిగా కనిపించిన శాలినితో సహా బెనర్జీ, తులసి, వంశీ వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. కేవలం వాళ్లు మాత్రమే కాదు, సినిమాలో నటించిన రచ్చ రవితో సహా కొంతమంది నోటెడ్ ఆర్టిస్టులు సినిమాకు మంచి బూస్టప్ ఇచ్చారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే: ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ ఫుల్ ఆన్ డ్యూటీ చేశాడు. ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం మినహా, ఇక వేరే ఎవరి సంగీతం ఊహించలేం. అంతలా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం పనిచేశాడు. నిజానికి ఒక 70% వరకు పాటలతోనే సినిమా సాగుతుంది, అయినా సరే ఎక్కడా సింక్ తప్పకుండా పూర్తిస్థాయిలో తన భుజాల మీద మోసాడు దేవి శ్రీ ప్రసాద్. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను ఒప్పుకోవడమే ఒక సాహసం అయితే, ఎక్కడా వంక పెట్టలేని విధంగా తీర్చిదిద్దడంలో దేవిశ్రీప్రసాద్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ ఎనలేని అవార్డులు సాధిస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఇక సింగీతం శ్రీనివాసరావు గురించి ఏమని చెప్పాలి? ఆయన ఆలోచించిన కథ, దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు అభినందనీయం. ఈ రోజుల్లో దర్శకత్వంలో వంకలు పెట్టడానికి వీలు లేకుండా ఏదో ఒక విధమైన చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్న దర్శకులు ఉండగా, సింగీతం మాత్రం అందుకు భిన్నంగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక డైలాగ్స్ రాసుకున్న తీరు కానీ, పాటలకు అనుగుణంగా లిరిక్స్ రాసుకున్న తీరు గాని కచ్చితంగా అభినందించదగ్గ అంశాలే. సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవెల్లో చూపించింది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా సినిమాకి తగ్గట్టుగా ఉంది. సింగీతం వయసును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రివ్యూ రాస్తే వేరేలా ఉండవచ్చు, కానీ ఒక సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా చెప్పాలంటే మస్ట్ వాచ్.
ఫైనల్లీ: ఈ సింగీతం.. ఓ సాహసం, ఓ ప్రయోగం.. ఖచ్చితంగా థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాటిక్ జర్నీ!
కొన్ని సినిమాలను రేటింగులతో కొలవలేం.. వాటిని ఎక్స్ పీరియన్స్ చేయాలంతే!