Reading Time: 2 minutes
వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!

సోషల్ మీడియా యుగంలో కొత్తదనం కోసం జనం చిత్రవిచిత్ర పనులు చేసి వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లి బృందం చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా బుల్డోజర్లపై బారాత్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేయాలని అనుకున్న వారికి ఊహించని షాక్ తగిలింది. మొరాదాబాద్‌లోని ఉమ్రీ కలా గ్రామానికి చెందిన ఓ వరుడు తన పెళ్లికి బుల్‌డోజర్‌పై రావాలని వింత నిర్ణయం తీసుకున్నాడు. బరాత్‌ సమయంలో బుల్‌డోజర్‌పై కూర్చొని పొగ తాగుతూ, డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశాడు. అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వరుడు ఉస్మాన్‌ గ్రామంలో పెళ్లి ఊరేగింపునకు సంప్రదాయంగా గుర్రం లేదా కారు బదులు బుల్‌డోజర్‌ను వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉస్మాన్‌ తన స్నేహితులతో కలిసి బుల్‌డోజర్‌పై కూర్చొని గ్రామంలో ఊరేగింపుగా వచ్చాడు. ఒక వీడియోలో అతను సిగరెట్‌ తాగుతూ పొగ రింగు రింగులుగా వదులుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. డీజే సంగీతానికి బుల్‌డోజర్‌పై ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తుండగా పెళ్లి అతిథులు అతడిని ప్రోత్సహిస్తూ కనిపించారు. వేడుకల సమయంలో మరికొందరు బరాత్‌ సభ్యులు కూడా బుల్‌డోజర్‌పైకి ఎక్కారు. కదులుతున్న బుల్‌డోజర్‌పై డజన్‌కు పైగా అతిథులు నిలబడి డ్యాన్స్‌ చేస్తూ హ్యాపీగా గడిపారు. బుల్‌డోజర్లపై పెళ్లి బృందం చేసిన హంగామాను అక్కడి స్థానికులు తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసారు. ‘యూపీ బుల్‌డోజర్ బారాత్’ వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. పెళ్లి ఊరేగింపును కొందరు నెటిజన్లు వినోదాత్మకంగా భావించినా, మరికొందరు ఇలా చేయడం వలన కలిగే ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. బుల్‌డోజర్‌పై డ్యాన్స్‌ చేయడం ప్రమాదాలకు దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, బుల్డోజర్ బరాత్ వైరల్ వీడియోలు కాస్తా ఉత్తరప్రదేశ్ పోలీసుల కంట పడ్డాయి. పబ్లిక్ రోడ్లపై ఇలా బుల్‌డోజర్లను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడం కింద వస్తుందని పోలీసులు సీరియస్ అయ్యారు. వీడియో ఆధారంగా ఆ బుల్‌డోజర్ల నంబర్లను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు, యజమానులకు, పెళ్లి నిర్వాహకులకు భారీ మొత్తంలో ట్రాఫిక్ చలాన్ విధించారు. భారీ యంత్రాలు, ప్రమాదకర విన్యాసాలు, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనతో పెళ్లి వేడుకలు ప్రజల భద్రత ను ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!