
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం సృష్టిస్తున్న డిమాండ్‌తో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన మెమరీ చిప్‌ల కొరతను అధిగమించడానికి భారతదేశం కీలక వేదికగా మారబోతోంది. దేశంలో ఈ విభాగానికి ఉన్న డిమాండ్-సప్లై వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు సరికొత్త అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, అలాగే ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారులు కూడా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నారని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన దేశీయ సెమీకండక్టర్, డేటా సెంటర్ రంగాల భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను పంచుకున్నారు.
భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రానున్న ‘ISM 2.0’ లో ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ‘ఇండియా సెమికాన్ మిషన్ 1.0’ లో ఇప్పటికే 48 స్టార్టప్‌లు సాంకేతిక ఉత్పత్తులపై విజయవంతంగా పనిచేశాయి. తదుపరి దశ (ISM 2.0) లో ‘చిప్ డిజైన్’ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామన్నారు. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన యంత్రాలను భారతదేశంలోనే డిజైన్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ చేసేలా అంతర్జాతీయ ఎక్విప్‌మెంట్ మేకర్లను ఆకర్షించడమే మా రెండో అతిపెద్ద లక్ష్యంగా పేర్కొన్నారు.
చిప్ తయారీ ప్రక్రియలో వాడే అత్యంత సంక్లిష్టమైన రసాయనాలు, గ్యాస్‌లను దేశీయంగానే ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు మరిన్ని ఫ్యాబ్స్ (చిప్ ప్లాంట్లు), ATMP (ప్యాకేజింగ్) యూనిట్లను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.
భారత్‌లో డేటా సెంటర్ పెట్టుబడులు త్వరలోనే 200 బిలియన్ డాలర్లను దాటనున్నాయి. దీనికి బిలియన్ల గిగాబైట్ల స్టోరేజ్ కెపాసిటీ అవసరమవుతుంది. AI డేటా సెంటర్లలో కీలకమైన ‘హై బ్యాండ్‌విడ్త్ మెమరీ చిప్స్’ కొరతను తీర్చడానికి మైక్రాన్ వంటి సంస్థలు ఇప్పటికే దేశంలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయని మంత్రి గుర్తుచేశారు.
అంతర్జాతీయ హైపర్-స్కేలర్స్ భారత్ వైపు మొగ్గు చూపడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని మంత్రి వివరించారు. భారతదేశంలో లభ్యమయ్యే నైపుణ్యం కలిగిన మానవ వనరులు, గత దశాబ్దంలో నిర్మించిన 2 లక్షల కిలోమీటర్ల సరికొత్త గ్రిడ్ వ్యవస్థ, దేశ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో దాదాపు 50% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే లభిస్తుండటం.
పర్యావరణ పరిరక్షణ
డేటా సెంటర్ల వల్ల పెరిగే విద్యుత్, నీటి వినియోగంపై పర్యావరణ ఆందోళనలు ఉన్నప్పటికీ, భారతదేశం అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. నీటి వినియోగాన్ని ఏకంగా 70 శాతం వరకు తగ్గించే సరికొత్త ‘వాటర్ కూలింగ్’ వంటి వినూత్న సాంకేతిక పద్ధతులను కంపెనీలు అవలంబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.